పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/108

ఈ పుట ఆమోదించబడ్డది

పలికారు. వాళ్ళ బృందానికి చెందని మరియిద్దరిమీదికిగూడ ఆత్మదిగివచ్చింది. అదిచూచి యోషువా అసూయపడ్డాడు. మోషేను వాళ్ళ ప్రవచనం ఆపివేయమని కోరాడు. కాని మోషే యిప్రాయేలు ప్రజలంతా ఆత్మనుపొంది ప్రవక్తలైతే బాగుంటుంది అన్నాడు. అతడు అంతటి ఉదారస్వభావుడూ, వినయవంతుడూను – 11,29. ఇంకోమారు మిర్యాము అహరోను అతన్ని తూలనాడారు. ఐనా మోషే సహించి వూరకున్నాడు – 12,1-3. మరోమారు యిస్రాయేలు ప్రజలు మోషే నాయకత్వాన్ని నిరాకరించారు, “ఆ మోషేకు ఏమికీడు మూడిందో మాకు తెలియదు” అంటూ యావేను విడనాడి విగ్రహారాధనకు పూనుకొన్నారు - నిర్గ 32,1. కాని అదేసమయంలో మహానుభావుడైన మోషే కొండమీద ఆ మూరులకొరకు దేవునికి మొరపెడుతూన్నాడు — 32,32. అతడు "ప్రభో వీళ్ళను పరామర్శించే బాధ్యత నా నెత్తిన పెట్టావెందుకు? నేనేమి వీళ్ళను కన్నానాయేమిటి" అని మొరపెట్టుకొన్నాడు - సంఖ్యా 11, 11-14. ఇది గెత్స్ మని తోపులో క్రీస్తుచేసిన ప్రార్థనలాంటిది - మార్కు 1436. మోషే శీలాన్ని అంచనా కట్టడానికి ఈ సందర్భాలు చాలు. ఎమ్మావు త్రోవలో ప్రభువు మోషే. ప్రవక్తలూ చెప్పినట్లుగానే నేను బాధలు అనుభవించాను అంటాడు — లూకా 24, 27. మోషే చెప్పినట్లు మాత్రమేగాదు, మోషే అనుభవించినట్లుగా గూడ బాధలు అనుభవించాడు క్రీస్తు.

6. క్రీస్తుతో పోలిక

మోషేకూ క్రీస్తుకూ చాల పోలికలున్నాయి. ఏలీయా ఎలీషాకు తన ఆత్మనిచ్చాడు - 2 రాజు 2, 9–12. మోషే యోషువాకు తన ఆత్మనిచ్చాడు - ద్వితీ 349, అలాగే క్రీస్తు కూడ మనకు తన ఆత్మనిచ్చాడు - యోహా 19,30, 16.7. అతడు క్రీస్తులాంటివాడు. మోషే భావిలో రానున్న క్రీస్తు ప్రవక్తను స్వయంగా పేర్కొన్నాడు - ద్వితీ 18, 18. అతని కష్టాలనుగూర్చి కూడ చెప్పాడు — లూకా 24,27. వాళ్లిద్దరికీ దగ్గరి సంబంధం వుండబట్టే తబోరుకొండమీద క్రీస్తుతోపాటు మోషేకూడ కన్పించాడు - లూకా 9,30.

సీనాయికొండమీద యావే తేజస్సుసోకి మోషేముఖం ప్రకాశించింది — నిర్గ 34.29–35, ఉత్థాన క్రీస్తు తేజస్సుసోకి, అతని నుండి వెలువడే ఆత్మనుపొంది, మనంకూడ ప్రకాశిస్తాం - 2 కొ 3,18.

మోషే యూదులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. క్రీస్తు మనకు వరప్రసాదమూ సత్యమూ ప్రసాదించాడు - యోహా 1,17. క్రీస్తు క్రొత్త మోషే, పూర్వం ఆ మోషే యూదులను వాద్దత్త భూమికి నడిపించుకొనిపోయాడు. ఈనాడు క్రీస్తు మనలను మోక్షంలోని తండ్రి యింటికి నడిపించుకొనిపోతాడు - హెబ్రే 3,5-6. ఈలా పూర్వవేదంలోని మోషే నూత్నవేదంలోని క్రీస్తుని తలపింపజేస్తాడు.