పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

 దేవుడే నరులు కూడా వాటి రచయితలే. వాళ్ళు ప్రధానరచయితలు కారుగాని, యథార్థ రచయితలు. కొన్ని బైబులు పుస్తకాల్లో వాటి రచయితల ప్రత్యేక వ్యక్తిత్వం కొట్టవచ్చినట్లుగా కన్పిస్తుంది.

బైబులు ప్రధాన రచయిత భగవంతుడు కనుక దానిలో తప్పలుండవు. దైవవార్త ఒక్క పాపంలో దప్పితే అన్ని విషయాల్లోను నరుడై జన్మించాడు. ఆ దేవుని గ్రంథం కూడ ఒక్క దోషంలో తప్పితే అన్ని విషయాల్లోను మానవ గ్రంథంగా వెలసింది.

3. బైబులు సంస్కృతి

బైబులుకి నరులు కూడ యథార్థ రచయితలు. వాళ్లు దాన్ని ఆయాదేశాల్లో, ఆయాకాలాల్లో, ఆయాభాషల్లో, ఆయా సంస్కృతులకు అనుగుణంగా రచించారు. ఈ సంస్కృతులను అర్థం చేసికోందే బైబులు సరిగా బోధపడదు. దానిలో విశేషంగా హీబ్రూ, గ్రీకు, రోమను సంస్కృతులు ప్రతిబింబిస్తుంటాయి.

4. దేశకాలాలు

యిస్రాయేలు ప్రజలు మోషే నాయకత్వాన క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో ఐగుప్తనుండి తరలివచ్చారు. యూదులు ఫరో బానిసంనుండి తప్పించుకొని వచ్చిన కథ అప్పటినుండి ముఖతః ప్రచారంలో వుంది. అది ఒక సంప్రదాయంగా రూపొందింది. క్రీస్తుపూర్వం 10వ శతాబ్దంలో సొలోమోనురాజు ఆస్థానవిద్వాంసులు ఈ మౌఖిక సంప్రదాయాన్ని గ్రంధస్థం చేయడం మొదలుపెట్టారు. అప్పటినుండి ఇంచుమించు క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దందాకా గూడా పూర్వవేదగ్రంధాలను క్రమేణ లిఖిస్తూనే వచ్చారు.

నూత్న వేదగ్రంథాలను క్రీస్తు ఉత్థానమైనంక ప్రారంభించి మొదటి శతాబ్దం అంతంవరకూ వ్రాస్తూ వచ్చారు కనుక బైబులు లిఖితరూపంలో పూర్తికావటానికి కనీసం 1100 ఏండ్లయినా పట్టివుండాలి.

పాలస్తీనా దేశం, బాబిలోనియా, రోమను సామ్రాజ్యం మొదలైన పెక్కుతావుల్లో బైబులును వ్రాసారు. కనుక ఆ గ్రంథం ఒక్క తావులో, ఒక్క కాలంలో, ఒక్క రచయిత లిఖించింది కాదు. అది 73 పుస్తకాల గ్రంథాలయం. భిన్నరచయితలు, భిన్నస్థలాల్లో, భిన్నకాలాల్లో దాన్ని రచించారు. ఐనా ప్రేరణశక్తివల్ల పై 73 గ్రంథాలకు ఐక్యత సిద్ధించింది. అవి ఏకగ్రంథంగా రూపొందాయి. ఆ పుస్తకానికి ఐక్యతనిచ్చే ప్రధానభావం క్రీస్తే, పూర్వవేదమంతా రాబోయే క్రీస్తుని సూచిస్తుంది. నూత్న వేదమంతా వచ్చిన క్రీస్తుని వర్ణిస్తుంది.