ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

భోజరాజీయము ఆశ్వా. 2


తే.

అధిప పెఱయాశ్రమస్థుల కందఱకును
విను గృహస్థాశ్రమమువాఁడె వెలయ నూఁత
యట్టి గృహమేధులకుఁ గీడు పుట్టకుండఁ
గాచుకర్తలు రాజులు గారె యరయ.

64


క.

ఏతన్మాత్రమహీపతి
వే తగవును ధర్మమును నహింసారతియున్
నీతియు ననఁగల యీగుణ
జాతము నీయంద కాదె శాశ్వత మయ్యెన్.

65


క.

ఏకచ్ఛత్రముగా భూ
లోకము పాలింపు బంధులోకముఁ గరుణం
జేకొని ప్రోవుము సజ్జన
లోకము మన్నింపు శత్రులోకవిదారీ.

66


శా.

నీ బాహాపరిరక్షణంబున గదా నిర్విఘ్నమై మా తపం
బేబాధం దిడ కిట్లు చెల్లుట ధరాధీశా! గిరీశుం ద్రిలో
కీబంధుం గరుణారసార్ద్రహృదయుం గీర్వాణవంద్యున్ దృఢ
ప్రాబల్యంబునఁ బట్టి యేఁ దప మొనర్పం గంటి నిశ్శంకతన్.

67


క.

నీవును నీ మంత్రులు నా
నావిధసుభటులును నేఁడు నా యింటికి ని
ట్లీవేళ నతిథు లయితిరి
గావున నాతిథ్య మిచటఁ గయికొన వలయున్.

68


చ.

అని తరుశాఖ డిగ్గి యతఁ డాతని నల్లనఁ జేరవచ్చినం
గనుఁగొని భక్తిపూర్వకము గాగఁ బ్రణామ మొనర్చి మోడ్పుఁగే
లొనరఁగ నో మునీంద్ర! భవదుజ్జ్వలనామ మెఱుంగఁ జెప్పవే
యనవుడుఁ బిన్ననవ్వు వదనాబ్జమునం బొడమంగ నిట్లనున్.

69


క.

ఒక పేరును నొక యూరును
నొక కులమును ననఁగఁ గలదె యోగీశ్వరజా
తికి? నయినను దాఁపగ నే
టికి సర్పటి యండ్రు నన్నొడికముగఁ బెద్దల్.

70