ఈ పుట ఆమోదించబడ్డది

కథాప్రారంభము

క.

సూత్రకథ భోజరాజచ
రిత్రమ, యానడుమ ధర్మరీతులు నీతుల్
చిత్రకథ లై తలిర్పఁగ
శ్రోత్రసుఖముగా నొనర్పఁ జొప్పడి యుండున్.

85


వ.

అదియును దత్తాత్రేయమునీంద్రుండు వక్తయు, మహుం డను కాంభోజ
మహీశుండు శ్రోతయుంగా నధిగతవిద్యాసమాజుండగు భోజుండు పూర్వజన్మం
బున బ్రాహ్మణుండై యుండి దారిద్య్రభారంబు తోరంబగుటవలన సంభవించిన
విరక్తి కారణంబుగాఁ దీర్థయాత్రచేయుచుఁ బ్రయాగయందు నిష్టకామ్యసిద్ధి
పొంది శరీరవిసర్జనంబు చేపి సజ్జనప్రియుండై పుట్టి లాటదేశంబునందు ధారా
నగరంబున కధీశ్వరుండై రాజ్యంబు సేయుచు నొకనాఁడు మృగయావినో
దార్థంబు వనంబునకుం జని యందు సర్పటి యను నొక్క సిద్ధపుంగవుం గని
తన పట్టణంబునకుఁ దోడ్కొని వచ్చుటయు వాఁ డట్లు చనుదెంచి యొక్క
రాత్రి రహస్యవృత్తిం దనప్రభావంబు నెఱపం దలంచి పంచలోహమయంబై
యొప్పు నప్పుడమిఱేని కొలువుచవికెం దనచేతి ధూమవేధి యను నౌషధంబుచేత
శుద్ధసువర్ణంబు గావించి యెందేనియుం బోవుటయు మఱునాఁ డవ్విధంబు
చూచి యాయద్భుతకర్మంబు సర్పటికృతం బని యతని వెదకించి కానక
యొక్క కృతకమతంబున నాకర్షించి భోజుండు ధూమవేధిఁ దా నపహరించు
టయు నతండు కోపించి శాపంబిచ్చుటయుఁ దదీయప్రార్ధనంబున శాపంబుఁ
గ్రమ్మఱించుటయుఁ దదనంతరంబు భోజననిమిత్తంబున భోజసర్పటులకు
సంవాదవశంబున వివిధపుణ్యకథాప్రసంగంబులు పుట్టుటయు నను వృత్తాం
తంబులం గలిగి యిక్కావ్యంబు సర్వజనాకర్ణనీయం బై భోజరాజీయం బను
పేరంబరగుఁ దత్ప్రారంభం బెట్టి దనిన.

86


క.

మహితసముజ్జ్వలతేజుఁడు
విహితాచారైకరతుఁడు వీరవినోద
స్పృహుఁదు బహుకార్యదక్షుఁడు
మహుఁ డను కాంభోజరాజు మహిఁ గడునొప్పెన్.

87