ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంజరుని కథ

189


క.

ఆరా జచ్చెరు వందుచు
నారాజసరోజముఖుల యస్థులు గంగా
వారిఁ గలిపి రం డని తన
వారిం బనుపంగఁ బోయి వారును నొకచోన్.

91


వ.

ఒక్క విప్రుండు పెద్దకాలంబు దేవి పురశ్చరణంబు చేసి తత్ర్పసాదంబున
సంజీవని వడసి యుండుట యాత్తపరంపరవలన నెఱింగి యతని యున్నెడ
కేఁగి తమతెఱంగు చెప్పి 'విప్రా! నీవు పెద్దయు నాయాసపడి గడించినదివ్య
వస్తువునకు దాత్కాలికంబై యత్యంతసుకృతప్రదంబగు ప్రయోజనంబు
సిద్ధించె, వీరలప్రాణంబు లెత్తు మిదియ నీదగు నౌషధంబునకు నిదర్శనంబు
నగు' నని ప్రార్ధించిన నతం డట్ల చేసిన.

92


క.

తారయు జ్యేష్ఠయు లక్ష్మియుఁ
దారాధీశుండు నెవ్విధంబున దుగ్ధాం
భోరాశి బుట్టి రట్టుల
యారమణులు నతఁడుఁ బుట్టి రౌషధశక్తిన్.

93


ఆ.

ఇట్లు పుట్టి యతనియింతి మన్మథవికా
రావలోకనంబు లడర నతని
చెట్ట పట్టఁ బోవఁ 'బట్టకు పట్టకు
పొలఁతి నీకుఁ దోడఁబుట్టు నైతి.

94


వ.

న న్నింక వరించుట యుచితంబు గా దూరకుండ' మనిన వెఱఁగుపడి యుండె
నంత నవ్వేశ్యయు నాలా గె ట్లనిన నతండు దాని కి ట్లనియె.

95


క.

'ధర్మాధర్మపథంబుల
మర్మ మొకని కొకఁడు చెప్పుమాటయ లోకం
బర్మిలిఁ గొని తెలియ వలదె
కర్మాకర్మైకయుక్తి గనియెడుపనికిన్.

96


క.

మదిరాక్షి! వినుము నీవును,
మదంగనయు, దాసియును సమంబు సుమీ! నా
హృదయమున' కిప్పు డనవుడుఁ
బొదలెడుకోపమున రాజపుత్రిక పలికెన్.

97