ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

అన్నదానపరుఁ డగు విప్రుని కధ


ఉ.

'వారణగంగ నాఁగ హిమవద్గిరిచేరువఁ జూడ నొప్పుఁ దెం
పారఁగ నొక్క పుణ్యనది, యానదిపొంత ననంతవైభవ
స్ఫారత నొక్కప్రో లమరుఁ, బన్నుగ హేమవతంబు నాఁగ; నం
గీరుఁడు నాఁగ నొక్క నృపకేసరి యప్పుర మేలు మేలుగన్.

151


క.

ఆవసుధావల్లభునకు
దేవి యొకతె సుమతి నాఁగ ధృతిమతి కాంతి
శ్రీవిలసద్గౌరవముల
రావై పతిభక్తిచే దృఢంబై మెఱయున్.

152


క.

ఆదేవికి సంతతి మున్
లేదు పతియు నేకభామినీవ్రతుఁడై సం
పాదింపఁడు మఱి భార్యల
నాదంపతు లున్నయెడకు నరుగుము విప్రా!

153


క.

అరిగి యథోచితవేళం
గర మనురాగమున వారిఁ గదిసి ధరిత్రీ
భరణక్షముఁ డొక తనయుఁడు
హరిసత్వుఁడు మీకుఁ బుట్టు నని చెప్పుతగన్.

154


ఆ.

పుట్టినపుడ సజ్జచుట్టును బెఱవారు
జనని యాదిగాఁగ సకలజనులు
తొలఁగి యుండి సన్నుఁ దొలుతఁ జూడఁగ నిచ్చి
సుతునిఁ పిదప మీరు చూడుఁ డనుము.

155


చ.

అని యొడఁబాటు చేసికొని యాశిశురత్నముఁ జేరి యేకతం
బున నడుగంగ వాఁడు దెలుపుఁ విశదంబుగ నన్నదానశో
ధనసుకృతంబుచొ ప్ప' నుచుఁ బార్వతి చెప్పిన నద్భుతాత్ముఁడై
'పనుపుము పోయి వచ్చెదఁ గృపారసమానస!' యంచుఁ జయ్యనన్.

156


చ.

వలగొని మ్రొక్కి నేత్రకరవారిజసంజ్ఞల నాభవాని వీ
డ్కొలుపఁ బునఃప్రణామములు గోరి యొనర్చి 'భవత్కటాక్ష మె
వ్వలనను నాకు రక్ష' యనువాక్యముతోడఁ దదీయసద్మమున్
వెలువడి యొక్కరుండు కడు వేడుక నుత్తరభూమి కేఁగుడున్.

157