ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోవ్యాఘ్రసంవాదము

137


ఆ.

అకట నీవు నన్ను నడకించి పోఁ జూచె
దేను మోసపోను గాని గోవ!
యడవిలోన నున్నయంతనె పులి యింత
యెఱుక లేని దయ్యెనే తలంప.

6


ఉ.

నావుడు నిట్లనుం గపిల 'నావచనంబు లనర్థకంబులే?
నీవు వివేకశీలుఁడవు నీ కిటు లాడుట యుక్తమే? ననుం
బోనిడు మంట ని న్మొఱఁగి పోవుటకే? పదివేలు చెప్పినన్
భూవలయంబులోఁ బలికి బొంకుటయుం బ్రతుకే తలంపఁగన్.

7


తే.

ఆడి తిరిగినఁ చండాలుఁ డండ్రు గాని
కులము చండాలుఁ డైనను గొఱఁత లేదు
బొంకకున్నఁ జండాలుఁడె పో ధరిత్రిఁ
బూజ్యుఁ డనుమాట వినవయ్య! పులులరాజ!

8


తే.

అతిథిసత్కారమునకంటె నధిక మైన
ఫలము లే దండ్రు పెద్ద లీ పట్టునందు
నీవ యతిథివి నాకు ని న్నిచట డించి
పోయి రాకున్నఁ బాపంబు పొరయ కున్నె?

9


ఆ.

కన్నకడుపుగానఁ గడుఁ బిన్న గాన నే
నతనిఁ బాసి దూర మరుగునట్టి
వేళ గాన వాని వీక్షించి రాకున్న
వగపు మాన దనిన వదల వైతి.

10


క.

నీ కిష్ట మైనఁ జాలుం
గా కట్టులు సేయు' మనినఁ గారుణ్యరసో
త్సేకంబై తన చిత్తము
వే కరఁగుడుఁ బుండరీకవిభుఁ డి ట్లనియెన్.

11


చ.

'కొడుకుఁ దలంచి నీవు గడుఁ గొందల మందఁగఁ జూచి గోవ! న
న్విడిచిన నాఁకటం దనువు నిల్వదు నాకు గృహంబు కేఁగి యే
తడవుకుఁ గాని రావొ శపథంబులు పల్కక నమ్మఁ జాల' నా
వుడుఁ బులిఁ జూచి గోవు 'వినవో మదిలో ననుమాన మేటికిన్.

12