ఈ పుట అచ్చుదిద్దబడ్డది

114

భోజరాజీయము ఆశ్వా. 5


తే.

అంత నక్కుంభి తన యాత్మ వింత లేసి
రోజూ లిట్లైరి తన తరమా జయంబు
గొనఁగ వ్యర్థుఁడై పోయెఁ గా కనుచుఁ గొంత
తడవునకు వచ్చె నా రాజతనయు కడకు.

28


ఉ.

వచ్చి కృతఘ్నుఁ డప్డు విడు వాలికకన్నులు ముద్దుమోము నే
యొచ్చెము లేని దేహలతయుం గల కోమలిఁ జూచి లోలుఁడై
యెచ్చట మోసపుత్తు నొకొ యీ నృపపుత్రుని నెప్పు డొక్కొ యే
నిచ్చపలాక్షి నెత్తుకొని యేఁగుదు నా కిరవైన చోటికిన్.

29


క.

అని యూహించుచు మిథ్యా
వినయంబును. రిత్తనగవు, వెడమ్రొక్కుల పె
ల్లును, డక్కరిమాటల తఱ
చును, నాఱడి సంభ్రమంబుఁ జూపె సఖునకున్.

30


చ.

అతఁ డవి కృత్రిమంబు లని యాత్మ నెఱుంగక , నిత్యసౌహృద
స్థితిఁ జెలికానిఁ జూచి 'యిటు చేకుఱె నాకు ననర్ఘ్యరత్నశో
భిత మగు నవ్విభూషణము, బ్రేమరసోదయహేతువైన యీ
యతివయు' నంచుఁ జెప్పె దరహాస మెలర్పఁగ నెమ్మొగంబునన్.

31


క.

చెప్పిన విని 'దేవా! నీ
కిప్పుడు రాఁ బ్రాప్తమైన యివి యెవ్వనికిం
దప్పింప వశమె! బ్రాతిగఁ
జెప్పుదు నినుఁగూర్చి యేమి చిత్రము చెపుమా!'

32


అని కొనియాడి యప్పు డితఁ దాడట నప్పురి కేగె నేని త
జ్జనపతియుం బ్రధానులును సర్వజనంబులు వీనియూరుఁ బే
రు నెఱఁగిపోదు రప్పు డొకరుండును గైకొనకుండు నన్ను మ
న్మనమున నున్న యిప్పని యొనర్చుటకు న్మఱి సందు లేదగున్.

33


క.

అటు గాన యా కుమారునిఁ
గుటిలాలకఁ జొప్పు దప్పఁ గొనిపోవక యుం
డుట కార్యము గాదనుచుం
జొట జొటఁ గన్నీరు దొరుఁగఁ జుట్టమ పోలెన్.

34