ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

భోజరాజీయము ఆశ్వా. 4


ఆ.

దిరిగి తిరిగి యధికదీనవక్త్రముతోడఁ
దోఁట దొడ్డి చొరఁగఁ దోలఁ బోయి
పడుచు పైద వెంటఁ బడి నొవ్వ వడుచునో
యేమి సేతు' నంచుఁ బ్రేముడించు.

65


వ.

అంతఁ దన యంతరంగం బంత యెఱింగిన నప్పులి సంశయించునో యను
తత్తఱంబునం జిత్తం బొక్కింత చేసికొని వైవర్ణ్యంబు దోఁపనీక క్రమ్మఱ
నమ్మొద వి ట్లనియె.

66


ఉ.

గుమ్మెడుపాల నాసుతునకుం బరితృప్తిజనించుఁ గాని మాం
సమ్ము సమస్తముంగొనక చాలదు నీ యుదరాగ్నికైన, ని
క్కమ్ముగ నిందులోఁ బ్రధమకార్యవినిర్గతి నీ వెఱుంగవే,
పొమ్మనవన్న! వ్యాఘ్రకులభూషణ! చయ్యనఁ బోయి వచ్చెదన్.

67


చ.

అనవుడుఁ బుండరీక మపహాస్యము చేసి 'యి దేమి గోవ! యి
ట్లనియెదు, నన్ను బేల్పఱచి యాత్మజుఁ డున్నెద కేఁగి సత్వరం
బునఁ జనుదెంతు నంటి, విది పోలునె, చెప్పెడువారు చెప్పినన్
వినియెడువారి కించుక వివేకము పుట్టదె యింత యేటికిన్.

68


ఆ.

గుండె నిమురుకొనుచుఁ గొడుకుపాలికి నేఁగి
కడుపు నిండఁ జన్ను గుడిపి నీవు
నెమరు పెట్టుకొనుచు నెమ్మది నుందుగా
కిచటి కేల వచ్చె దెఱిఁగి యెఱిఁగి.

69


వ.

అనిన నప్పుండరీకంబునకు వివేకంబు లేదు గదే యని శోకంబు నొందుచు
నా గోకులరత్నంబు వ్యాఘ్రంబునకు నిట్లను 'నే నిన్ను నొకకొన్ని వేష
భాషలం బ్రమోషించి యట పోయి క్రమ్మఱ రాకుండుదు నని నను నమ్మనేర
విది సాధులక్షణంబె? యే నసత్యవచనురాలనె?

70


క.

ఒక యితిహాసము చెప్పెద
నకలంకత వినుము, సూనృతాత్ముల చరితల్
సకలాఘక్షయకరములు
సుకృతనిధానములు కర్ణశోభితలీలల్.

71