ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

53


క.

అనవుడు 'మీయట్టి మహా
త్మున కెవ్వరు వలదు గాక, మునుకొని గృహధ
ర్మనిరూఢుఁడ నగు నాకుం
దనయులు వల దయ్య? రిత్త తర్కము లేలా?

164


క.

ఆరయ సంసారమునకు
దారాపత్యములు గావె తగునంగము లిం
పార నవి లేనిపురుషుని
పే రెవ్వఁ డెఱుంగు వాని పెం పేమిటికిన్?

165


ఆ.

దివియ లేనిగృహము తెఱఁగున సంతాన
రహితుఁ డైనవాని బ్రతుకు చూడఁ
గడు నిరర్ధకంబు గాదె? నావుడు నతఁ
డతనితోడ నిట్టు లనియె నధిప!

166


ఆ.

'సుతుఁడు, నిధియు, వనముఁ, గృతియు, నల్లిల్లును,
గుడియుఁ, జెఱువు ననఁగఁ బుడమియందు
సంస్తుతింపఁ బరగు సప్తసంతానముల్
గలవు కీర్తిసుకృతకారణములు.

167


తే.

తొలుత నిందులోఁ బుత్రుండు తొలఁగె నేని
నున్నయాఱును నేలోక మొసఁగఁ జాల
వధిప! యిన్నింటిలోపల నధిక మరయఁ
గృతియ చూ నిత్యకీర్తికి గతియుఁ గాన.

168


క.

తొల్లిటిపెద్దల చరితలు
తెల్లంబుగ నేఁడు మనకుఁ దెలియుట ధరణీ
వల్లభ! యిటు వినుమా! విల
సిల్లుకృతులవలన నగుట సిద్ధము గాదే

169


ఉ.

ఆర్వురు చక్రవర్తులుఁ బదార్వురు రాజులు నేఁటివారలే?
యుర్వి బహుప్రకారముల నొప్పుగఁ బోలన చేయరే? గుణా
ఖర్వులు వారలుం జనిరి కాదె? తదీయయశంబు లెల్లెడం
బర్వుట సత్కవీంద్రఘనభాషితసత్కృతిమూలమే కదా.

170