ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

45


నప్పైఁడిమేడ దా విప్పించి యొక్కోక
       ప్రతికి నూఱును వేయి ప్రతులు గాఁగఁ
గప్పెర లాతంబు ఘనకమండలువులు
       మొదలుగా నన్నియు మున్న చేసి


ఆ.

యితరు లెఱుఁగకుండ నిది యెవ్వ రేమి దె
చ్చినను వానిఁ బుచ్చుకొని తొలంగ
వైచి యిచ్చుఁ దన సువర్ణకల్పితములు
బొంకు నిక్క మయ్యె భోజు మతము.

109


క.

వారును దమ తెచ్చినయవి
బోరనఁ దనవిద్యవలన భోజుం డిచ్చో
గారవముఁ జేసి మా కిం
పారఁగ నిచ్చె నని సుముఖులై చనుచుండన్.

110


తే.

తీర్ధముల కేఁగున ట్లెల్లదేశముల జ
నంబులును భోజవిభునిఁ బ్రియంబుతోడఁ
జూడ నరుగంగ సర్పటి చోద్య మంది
నెమ్మి నిట్లని తలఁచుఁ జిత్తమ్మునందు.

111


చ.

వెలయఁగ శబ్దభేది యనువిద్య జగంబున భోజరాజుచే
గల దఁట, వాఁడెపో నృపనికాయముకెల్ల ను మేటి, వానిచేఁ
గలుగుట యేను మున్నెఱుఁగఁ గాని, యెఱింగినఁ బుచ్చుకొందు నాఁ
డెలమి దలిర్ప నప్పురికి నేఁగినయప్పుడ మిత్రభావనన్.

112


ఆ.

ఇంక నైన నచటి కేఁగి యానరనాథ
చంద్రుచేత నున్న శబ్దభేదిఁ
బుచ్చుకొనఁగవలయుఁ బొలుపార నాచేత
నున్నధూమవేధి యొసఁగి యైన.

113


ఉ.

తక్కువజాతియందు వనితామణియున్నను, నీచమర్త్యునం
దెక్కువవిద్య బొప్పడిన, నెంగిలిచోట సువర్ణ మబ్బినన్
దక్కక పెన్ విషంబున సుధారస ముండిన గ్రాహ్య మండ్రు; వాఁ
డొక్కమనుష్యమాత్రుఁడె మహోన్నతుఁ డున్నతరాజపూజ్యుఁడున్.

114