ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

41


శా.

ఆవేళన్ వివిధాశ్రితవ్రజచకోరానందుఁడై విస్ఫుర
ద్భావుండై విలసత్కలాకలితుఁడై భగ్నీకృతారాతిభూ
పావష్టంభతమస్కుఁడై కువలయాహ్లాదప్రదుండై యశ
శ్రీవిభ్రాజితచంద్రికుం డయి తనర్చెకా భోజరా జున్నతిన్.

84


సీ.

సంగీతవిద్యాప్రశస్తమానసులతోఁ
       గూడి వినోదించుఁ గొంతదడవు
సాహిత్యవిద్యావిశారదాత్మకులతోఁ
       గూడి వినోదించుఁ గొంతదడవు
నృత్తవిద్యాకళాయత్తచిత్తులతోడఁ
       గూడి వినోదించుఁ గొంతతడవు
వాద్యవిద్యానిరవద్యభావకులతోఁ
       గూడి వినోదించుఁ గొంతతడవు


ఆ.

శబ్దశాస్త్ర మంత్రశాస్త్ర ధనుశ్శాస్త్ర
తురగశాస్త్రవిదులతోడిగోష్ఠి
నడుపుఁ గొంతతడవు నయశాస్త్రవేదులఁ
గూడి మాటలాడుఁ గొంతతడవు.

85


చ.

దళ మగు హంసతూలనిజతల్పమునందు నిజప్రియాంగనా
లలితకుచోపగూహనములన్ మధురాధరపానలీలలం
దలకొని యంగముల్ పులకితంబులుగా సుఖియించు నవ్విభుం
డెలమి దలిర్పఁ గొంతతడ విక్షుశరాసనుఁ గ్రేణి సేయుచున్.

86


వ.

మఱియు నెవ్వేళ నెయ్యది కర్తవ్యం బట్టి కృత్యం బప్రమత్తుం డై యొనర్చు
నప్పుడమిఱేనికి నిమిషార్థంబును నిరర్థకం బయి పోవ దిట్లు నిశాసమయ
ధర్మంబులు చెల్లుచుండ నక్కడ సర్పటి సిద్ధుండు.

87


క.

నను నీతఁడు వేడుకపడి
కొనివచ్చెను, వీనితోడి గోష్ఠికిఁ దగులై
యునికి తగ; దితని కొక మే
లొనరించి యథేచ్చఁ జనుట యుక్తము నాకున్.

88