ఈ పుట ఆమోదించబడ్డది

నెన్నియో యుపద్రవములు జరిగినవి. క్రీ. శ. 945 లో కాంభోజ దేశీయులును, 982, 1034, 1069 సంవత్సరములలో అన్నామ్ దేశీయులును చంపారాజ్యముపై దండెత్తియాకాలపు రాజులను చంపియు, దేశమును కొల్లగొని దేవాలయములను కట్టడములను ద్వంసముచేసియు, నల్లకల్లోల మొనర్చిరి. ఇదేసమయమున శ్రీవిజయ పాండురంగవిషయాదిపులు విద్రోహ మొనర్చిరి. కాన చంపారాజవంశములకు స్థైర్యము లేకుండినది. ఈకాలమున శాక్తధర్మ మీరాజ్యమున ప్రబలినది. క్రీ. శ. 1075 లో మూడవ హరివర్మమహారాజు అన్నాం, కాంభోజదేశములనోడించి, చంపారాజ్యము నాక్రమించెను. ఈవీరాగ్రణి శత్రువులచే నాశమొనర్పబడిన హిందూదేవాలయముల నన్నిటిని బాగుచేయించి, క్రొత్తవాని నెన్నిటినోనిర్మించెను. చంపారాజ్యమున తిరిగీ శాంతిసౌఖ్యములు ప్రబలినవి. ఈరాజు మరణించినపుడు రాణులు నల్గురు సహగమనమొనర్చిరి. అనంతర మీతని పుత్రుడు బాలుడగుటచే నీతనితమ్ముడగు పరమబోధిసత్వుని బ్రజలెల్లరును దమ కేలికగ నెన్నుకొనిరి. ఈక్రొత్తరాజు బౌద్దమతము నవలంబించెను. పాండురంగ విషయాధిపు డీకాలమున విద్రోహమొనర్చెను గాని శీఘ్రకాలముననే యణంచబడెను. క్రీ. శ. 1139-1144 నడుమ పదునొకటవ రాజవంశము పరిపాలనమునకు వచ్చెను. ఈకాలమున శైవబౌద్దమతములు రెండును చంపారాజ్యమునవర్థిల్లినవి. క్రీ. శ. 1192 నుండియు నీరాజ్యము క్షీణించెను. ఇంతటితో నిచటి హిందూరాజుల ప్రతిభ నశించినది. ఉత్తరమున శ్రీవిజయ విషయము కాంభోజరాజుచే జయింపబడెను. పాండురంగ విషయమును స్థానికులగు చాము లాక్రమించిరి. క్రీ. శ. 1203-1220 నడుమ చంపారాజ్యమంతయు కాంభోజసామ్రాజ్యమున గల్పుకొనబడెను. క్రీ. శ. 13 వ శతాబ్దిమూడవపాదమున చెంగిస్‌ఖాన్ తనయుడగు కుబిలైఖాన్ అను మంగోలురాజు చంపాపై యనేకసార్లు దండెత్తెను. తుదకు క్రీ. శ. 1318 ప్రాంతమున అన్నాందేశీయులు చంపా రాజ్యమును వశపరచుకొనిరి. ఇంతటితో చంపా హిందూరాజ్యచరిత్ర ముగిసినది.