ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


13

ఈ నూతన సంప్రదాయపు తోలుబొమ్మలాటను మొదట అడయారులో డాక్టరు కజిన్సు మొదలగు సహృదయుల మ్రోల, ఓ రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభించి ఆడింపించాడు కామేశ్వర్రావు. ఆట పన్నెండు గంటలకు పూర్తిఅయింది.

రంగంలో వుండవలసిన చిత్రాల మీదే వెలుగు పడుతుంది. ఉండనక్కరలేని బొమ్మలు తెరమీద లేవు. అభినయం, నృత్యం రసము వుట్టిపడుతున్నవి. సంభాషణ తెలుగులో చక్కని నుడికారంతో, తేనెలూరు తున్నది. హంగు చేసే సంగీతం విచిత్రము. ఉత్కృష్టపాత్రలు కర్ణాటక సంప్రదాయంగా నున్ను, ఇతరపాత్రలు యేలపాటల పద్ధతిగా నున్ను పాటలూ, పద్యాలు గానం చేసినారు, మహారాజు వస్తూ వున్నప్పుడు ఒక విధమైన సమ్మేళనగానం. మహాఋషి వస్తూ వున్నప్పుడు వినిపించిన సమ్మేళనగానం వేరు. మొదటిది ప్రాపంచికాద్భుతం సూచిస్తున్నది. రెండవది పారలౌకిక భావరసాలు వుట్టిపడజేస్తున్నది.

అందరూ నిస్తబ్ధులై చూశారు.

మీనాక్షి యింతపెద్దకళ్లు చేసుకుని కథ అంతా గమనించింది. ఆమె పేరుపొందిన సంగీత విద్వాంసురాల నన్న భావంతో తాను జట్టులో పాలుపుచ్చుకోలేదు. కామేశ్వర్రావు అందుకని ఆమెను ప్రార్థించనూ లేదు.

92