ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

11

కామేశ్వర్రావు జట్టునంతా చెన్నపట్టణం తీసుకెళ్లినాడు. అది 1925 వ సం. డిశెంబరునెల. అడయారులో దివ్యజ్ఞాన సమాజముయొక్క షష్టిపూర్తి మహోత్సవము అఖండ వైభవంతో జరుగుతూ వున్నది. దేశదేశాలనుంచి సభికులు ప్రతినిధులుగా వచ్చారు. వేలకువేలు సామాజికులూ, కాని వాళ్లూ కూడా ఉత్సవాలు చూచి ఆనందించడానికి వస్తూ వున్నారు. ఒకవైపు మహామఱ్ఱి వృక్షంక్రింద సభలు. ఒకవైపు చిత్రకళాప్రదర్శనం. ఇంకోచోట బౌద్ధ, పారశీక, క్రైస్తవ, జైన, మహమ్మదీయ, యూధ, హిందూమతాదులప్రార్థనలు. అఖండకోలాహలంగా వున్నది.

డాక్టరు జేమ్సు. హెచ్. కజిన్సుపండితుడు భారతీయ కళా వైభవ సముద్రములో మునిగి ఆనందపారవశ్యుడైపోతూ వుంటాడు. భారతీయ కళాద్భుతానికి దూరంగా వున్న భారతీయ మహాశయులకున్ను, ఇతర దేశీయులకున్ను ఆ కళలలో వున్న ఉత్కృష్టత వెల్లడించడానికి సంకల్పించు కొన్నా డా మహానుభావుడు.

ఆయన ఆ ఉత్సవాలకు జావా నుంచి ఒక తోలుబొమ్మలవాళ్ల జట్టు, వీధినాటకంవాళ్ల జట్టు రప్పించి ప్రదర్శనాలు యిప్పించాడు. ఆ ప్రదర్శనాలన్నీ కామేశ్వర్రావు మీనాక్షివాళ్లతోపాటు పరికించినాడు, ఆశ్చర్యపూరితుడైనాడు. ఆతని భావాలు ఆకాశవీధుల పరువులెత్తినవి.

88