ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

పోతూ వున్న విగ్రహము. మోము కోల. వెడల్పు కొంచెము తక్కువైన పొడుగుపాటి కన్నులు. చివరకొంచెము వట్రువ తిరిగిన ముక్కు. మావి చివుళ్ళ పెదవులు. అపశ్రుతిలేని సౌందర్యఖని. ఆ బాల మోము కళాకోవిదత్వము స్పష్టీకరిస్తూ వున్నది.

ఇదివరకు యేనాడున్నూ కామేశ్వర్రావు ప్రణయావేశుడు కాలేదు. పవిత్రమైన తెలగవారి కులం లో పుట్టిన తనకు, ఈ నీచంగా సంచరించే బొమ్మలాటవాళ్ల కన్నెపై ఈ రోజున ఈ ప్రణయ ప్రాదుర్భావము యేవిఁటి? చదువుకుంటూ వున్నా డనిన్నీ, ఇంత అన్నవస్త్రాలకి ఇబ్బంది లేకుండా వుండే సంప్రదాయకుటుంబంలోని పిల్ల వాడనిన్నీ ఆలోచించి, యెక్కువ కట్నంతో, తమబాలికల నిస్తామని అనేక పెద్ద కుటుంబాల నాయుళ్లూ, కాపులు వస్తూ ఉన్నారు. చక్కని, తెలివైన, చదువుకున్న బాలికను చూసి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాడు. ఆలాంటి తనకు ఈ ప్రేమ యెక్కడనుంచి ప్రత్యక్షమయిందో!

ఆ బాలిక ఈ ఊళ్ళోనే సంగీతము నేర్చుకుంటున్నది. అతని హృదయం రాగాలు పాడింది. తాను కూడా సంగీతము నేర్చుకోవాలని చిరకాలం నుంచి ఉన్నదిగా !

మర్నాడు సీతారామయ్య గారిని కలుసుకున్నాడు.

"ఏమండీ, గురువుగారూ, నమస్కారం."

"దీర్ఘాయుష్యమస్తు, వివాహసిద్ధిరస్తు. యేమండీ,

65