ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ఇలాంటి గొంతుకే నాచేతిలో పడితే, దీని ముందర కిన్నెరుల పాటలూ, మహతీవీణా కూడా అపశ్రుతిస్వరాలు పలకొద్దూ. దీని కీ గళ మెక్కడ నుం చొచ్చిందీ?"

"మా తల్లి గొంతు ఇంతకన్న అందగా ఉండేదండి" అని నడిమివయస్సుస్త్రీ బదులు చెప్పింది.

"నేను వీరయ్యతో మాట్లాడుతాను. అతన్ని ఒకసారి రేప్రొద్దున్న మా ఇంటికి పంపించు."

వాళ్లిద్దరూ వెళ్ళిపోయారు. సీతారామయ్యగారి కా మధురమైన గొంతుక ఆ రోజల్లా వినబడుతోనే ఉంది.

మఱునా డుదయమే వీరయ్యా, విఠలుడూ వచ్చారు. వీరయ్య ఎదటివాళ్లకు గౌరవం ఇచ్చి తనకు గౌరవం తెచ్చుకునే రకం. ప్రపంచకం యొక్క దాతృత్వం మీదే తాను ఆధారపడి ఉన్నప్పటికీ, వీరయ్య భట్రాజుకాదు. సీతారామయ్యగారి వంటి పండితోత్తముడు, సజ్జనుడు, ఉత్తమ గాయకుడు తన మనమరాలికి సంగీతం నేర్పడం కన్న అదృష్టం ఇంకోటి లేదని తెలుసును. అయినప్పటికీ ఈ రోజుల్లో తనకు వచ్చే ఆ కొద్ది రాబడీ తన మనుమరాలి గొంతుకవల్ల వస్తోంది. ఆ గొంతుకు వినబడకపోతే ఏ వూళ్ళోనూ అయిదు రూపాయల కన్న ఎక్కువ దొరకవాయను. సంగీతం నేర్చుకుంటే వచ్చే లాభం ఏమిటి? ఆటలకి ఎక్కువ డబ్బు వస్తుందా? లేకపోతే తాను తన మనుమరాలిని వెంటపెట్టుకొని సభలు చేయిస్తాడా? పైగా

60