'బాపిరాజు'
హనుమంతుడు దేహమంతా కదుపుతూ శిరస్సు శ్రీరామచంద్రుని పాదాలకడ ఉంచుతూ ఆడిపోతున్నాడు. ఓ పక్కన ఉన్నబొమ్మలు తీసేసి, అక్కడ సుగ్రీవుడు, తారాదేవి, ఇద్దరు చెలికత్తెల విగ్రహాల్ని ప్రవేశపెట్టారు. సుగ్రీవుడు తారాదేవితో నర్మసంభాషణలు చేస్తున్నాడు. ఇంతలో తారాదేవి భర్తకు జవాబుచెపుతూ ఒక పాట యెత్తుకుంది. ఆ గొంతుక కిన్నరీమాధుర్యము, సమ్మోహన పూరితము, కాకలీమృదులోలితము.
ఆ పాట వింటూనే సభంతా నిశ్శబ్దం అయిపోయింది. పండితపామరుల యావన్మంది హృదయాలూ ఆనందంచే ద్రవించి పోయాయి. ఆ గానప్రవాహము సుళ్ళుచుట్టి సెలయేళ్ళయి ప్రవహించింది.
పెద్దకాపుగారి అరుగుమీద గోడకు జార్లాబడి, ఒయ్యారంగా సిగరెట్టు కాల్చుకుంటూ యేదో ఆలోచిస్తూన్న కామేశ్వర్రావు గబుక్కున లేచి కూచుని బొమ్మలతెర వంక చూశాడు. ఏమిటా ఆ గొంతుక? అని అనుకున్నాడు. వింటూన్నట్టు విననట్టూ, కునికినట్టు కునకనట్టూ కూచుని ఉన్న గాయక శ్రేష్ఠుడు సీతారామయ్య గారు ఉలిక్కిపడి, అతిశ్రద్ధతో పాట ఆలకించడం మొదలెట్టాడు. ఆ కంఠము అతితియ్యటిది. శారీరములో గంభీరత ఉంది. స్వాధీన కంఠము. శ్రమలేదు. యెత్తుగడలో, గమకంలో ప్రకృతి జనితమైన వైచిత్య్రముంది. ఆ బాలిక వీరయ్య కేమవుతుందో అనుకున్నాడు సీతారామయ్యగారు.
58