ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ప్రదేశంలో నాలుగు తాళాలు, మద్దెల, తారశ్రుతిలో, మూడో కాలంలో, చతుష్కళలో "విఘ్న రాజా సిద్ధి వినాయకా" అంటూ నాటరాగంలో, ఏడు గొంతుకులు లయగా కలిసి, హంగు చేస్తూ వుండగా విఘ్నేశ్వరునిబొమ్మ ప్రవేశపెట్టించారు. 'తైతకధిమికిట' అని ఆ వినాయకుడు తాండవించిపోతున్నాడు. సభికుల హృదయాలు ఝల్లుమన్నాయి. పాట అయిపోయింది. వెనుకటి శ్రావ్యమైన వృద్ధ కంఠము ఇట్లా పలికింది :

వినాయకో విఘ్నరాజో ద్వైమాతుర గణాధిపాః !
అప్యేకదంత హేరంబ లంబోదర గజాననాః.
ఇత్యమరః.

శ్లో|| శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
    ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే.

అని యీలాగున ఈ రోజున మేము ఆడబోయేటటువంటి శ్రీమద్రామాయణంలో రామరావణాయుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం అనే ఆట ప్రారంభించేముందు విఘ్నేశ్వరుని ప్రార్థించిన వారమగుతూ యింక చదువుల తల్లియైన సరస్వతీ దేవిని ప్రత్యక్షం జేసుకుంటున్నాము.

"వీణా పుస్తకపాణి...." అనే శ్లోకం పాడుతూ విఘ్నేశ్వరుని విగ్రహాన్ని తీసి సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రవేశ పెట్టారు. ఆమెను లాస్యగతిని నాట్యమాడించారు. చక్కని పాట పాడారు. భాగవతాది గ్రంథాలలో సరస్వతీదేవి మీద

54