ఈ పుట ఆమోదించబడ్డది

నరసన్న పాపాయి

ఊళ్ళోవాళ్ళు మేము కులం నాశనం చేశామని తిట్టుకుంటున్నారట. రాములవారిలా ఆజానుబాహువులు కలవారూ, అందమైనవారూ, బంగారం చాయ కలవారూ, సాధుమూర్తీ అయిన మా వా రంటే అందరికీ భయమూ, భక్తీ! అయినా మమ్మల్ని అందరూ తిట్టేవారు.

వాళ్ళంతా రుద్రేశ్వర దేవాలయం లోకి నరసన్న వంటి హరిజన బాలకులు వస్తే చావగొట్టే జాతి వాళ్ళు! మా అన్నయ్య నరసన్నను ఒక శివరాత్రినాడు చావకొట్టాడు. మా అన్నయ్య మా ఇంటికి మేం నరసన్న భార్యను పురిటికి తీసుకు వచ్చినప్పటి నుండీ మా ఇంటికి రావడం మాని వేశాడు. నరసన్నే నాకు అన్న! 'అవును రవణా! రుద్రేశం తల్లికడుపున బుట్టిన అతడే నీకు అన్న! అతడే మన కింత తిండి పెడుతున్నాడు!' అని వెన్నెలలాంటి చిరునవ్వు నవ్వుతూ మా ఆయన అన్నారు.

మా వారు భగవంతులే !

నరసన్న ఎన్నికలలో నెగ్గాడు. చెన్నపట్టణం శాసన సభకు సభ్యుడట !

ఆ రోజు మావారు కాంగ్రెసు నాయకులకూ ఊళ్ళ వారందరికీ విందుచేశారు. నరసన్న మా వారి పక్కనే కూర్చున్నాడు విందులో.

49