ఈ పుట ఆమోదించబడ్డది

నరసన్న పాపాయి

'నరసన్న భార్యకు తలదువ్వాను !' నా కళ్ళల్లో భయమూ, ఏ మంటారు యిక అన్న అల్లరితనమూ రెండూ నర్తించాయి.

'ఇక నన్ను మా వారు తన కౌగిలిలో నలిపివేశారు. నా రవిక ముడి వీడిపోయినా, నాకు సిగ్గు పొంగుకువచ్చినా ఆయనకేమీ! అల్లరి అబ్బాయి.'

'రత్తాలు పాపాయి నెత్తుకుంటుంది!' ఆయన కళ్లు నా కళ్లల్లోకి అతి గాఢంగా చూచాయి.

నా కంటి రెప్పలు అరమూతలుగా వాలినవి.

'ఆ పాపాయి రుద్రేశ్వరం గుడిలోకి వెడ్తాడా అండీ?'

'రుద్రేశ్వరమే? కాశీ విశ్వేశ్వరమే!'

"ఆ పాపాయిని మా అన్నయ్య వంటి వారు ఎవరూ కొట్టరు కదాండీ,' నా గుండె దడదడలాడింది.

రత్తాలు పురిటికి కష్టం అయింది. అంత బండలాంటి నరసన్నా ఒకటే గోల!

మా వారు పెద్ద డాక్టర్ని తీసుకు వచ్చారు.

రత్తాల్ని వాళ్ళగూడెంలో గుడిసెనుండి మా ఇంటికి తీసుకువచ్చారు. మా దంపుళ్ళ గది పురిటిగది అయింది.

డాక్టరుగారు మూడు గంటలు కష్టపడ్డారు. నరసన్న కూతురు ప్రపంచ రంగంలో ప్రవేశించి 'కేరు' మంది.

నేను లోపలికి పరుగెత్తాను. సిద్దిలా చేతులూ కాళ్లూ ఆడిస్తూ అల్లరి చేస్తూంది ఆ పాపాయి.

47