ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

'నాకు చదువెందుకండీ కామందుగోరూ!' అన్నది రత్తాలు పకపక నవ్వుతూ! నరసన్న మాకు పాలేరయిన కొద్ది రోజులకు రత్తాలుతో అలా అన్నాను. అంతటితో వదిలానా రత్తాలుచేత 'వీరవల్లడు' చదివించాను.

నాకు బాగా చదువు చెప్పించారు మా వాళ్లు. ఇంటి దగ్గిరే ఇంగ్లీషూ చదివా! మా వారూ ఏదో బందరువెళ్ళి ఇంటరుమేడియేటు ఫేలయివచ్చి వ్యవసాయంపెట్టారు.

ఆయన 'మన నరసన్న హరిజనుడు రవణా ! ఎన్ని శతబ్దాలనుంచి వాళ్లు అలా బాధపడుతున్నారూ? వాళ్లు మనుష్యులు కాదనా మనవాళ్లు రవణా!' అని నన్ను దగ్గిరకు చేర్చి ఏదో తనలో అనుకున్నట్టుగా అన్నారు.

'నరసన్నను మా అన్నయ్య కొట్టాడండీ!'

'ఎప్పుడూ?' ఆయన ఆదుర్దా యెంతో మూర్తి తాల్చింది.

'చిన్నతనం లో నండీ! రుద్రేశ్వరస్వామి గుళ్ళోకి రాబోయాడు. మా అన్నయ్య వాణ్ణెరుగును. మా అన్నయ్య చావగొట్టాడు!' చిన్ననాటి ఆ దృశ్యం అంతా జ్ఞాపకంవచ్చి నాకూ కళ్లనీళ్లు తిరిగాయి.

మా వారు నన్ను తమ హృదయానికి పొదివి కొని, "నీ హృదయం నవనీతం రవణా" అన్నారు. ఆయన ముద్దులు నాకు గాఢమైన ఆనందమూ, యెంతో సిగ్గూ కలిగిస్తాయి.

46