ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

4

తండ్రికుమారు లిద్దరూ అనుకున్న మాటే నిజ మయింది. శ్రీమంతులు యార్లగడ్డ నాగమనీడు ప్రభువుకు తంజావూరు నుండి రఘునాధ మహారాజు మంత్రియయిన అప్పయ్య దీక్షితుల వారు అన్ని పరికరాలతోను, ఆయుధాల తోను, సంపూర్ణ సైన్యయుక్తంగా రావలసిందని మహారాజు ఆజ్ఞ పంపించారు. నాగమనీడు ప్రభువు తన స్నేహితుడైన కొండపల్లి అన్నారెడ్డి ప్రభువుకు, కొండవీటి చిన్నారెడ్డి ప్రభువునకును, తంజావూరికి సైన్యాలతో తరలివెళ్లడం విషయంలో రాయబారులు పంపించారు.

దేవరకోటలో అలజడి యెక్కువగా వుంది. నాగమనీడు ప్రభువు ఆజ్ఞ డిండిమాలతో, డప్పులతో రాణువుపోగుదల నాయకులు దేవరకోటరాజ్యం అంతా చాటింపించారు. ఊళ్లను పాలించే పంచాయితీలకు రాజముద్రాంకితమైన వార్తలు వచ్చాయి. రఘునాధభూపాల మహారాజు ఆజ్ఞ వెలనాడు, వేలనాడు, రేనాటి విషయం, కొండవీడు, కొండపల్లి, కందనోలు, పాకనాడు మొదలయిన యావత్తు ఆంధ్ర భూమికి సంచలనం కలుగ జేసింది. కృష్ణదేవరాయని చల్లని రాజ్యం తలుచుకోనివారు లేరు. జగ్గారాయలు, మధుర ప్రభువైన ముద్దు చెన్నప్పనాయుడు, ఆంధ్ర సామ్రాజ్యానికి తల పెట్టిన విపత్తును తలిచి కోపించి పళ్లు పటపట కొరకనివాడు లేడు.

106