పుట:Bhaarata arthashaastramu (1958).pdf/49

ఈ పుట ఆమోదించబడ్డది

మూఁడవ ప్రకరణము

అర్థలక్షణము

ఇక నర్థస్వభావంబు నిర్ణ యింపవలయు. అర్థంబన ద్రవ్యము మాత్రమే కాదు వాంఛాపూర్తికి నిమిత్తమాత్రమగు మూల్యసహిత వస్తుసముదాయంబంతయు నర్థంబునాబడు. తోటలు, పొలములు, ఇండ్లు, ఎద్దులు మొదలగునవియన్నియు రూప్యంబులబోలె నర్థములే. కానుకలుండువారేగాక సామగ్రులు సమగ్రముగా గలవారు సైతము భాగ్యవంతులనబడుదురు. ద్రవ్యమనగా క్రయవిక్రయంబులు సులభముగ జరుపుకొఱకు సాధనమగు నాణెములమొత్తంబు ప్రకృత మీదేశములో రూపాయలు, సవరనులు, అణాలు, పైసలు నాణెములుగా నుపయోగింప బడుచున్నవి కొన్నిదేశములలో పైసలకన్న దక్కువనాణెములుగా చిల్లిగవ్వల వాడెదరు అమ్ముటకును గొనుటకును ననుకూలముగనుంటయే ద్రవ్యసామాన్యలక్షణంబు

అర్థమునకు వాంఛాపూర్తియే ప్రయోజనంబు, ప్రయోజనమునకురాని యేవస్తువుగాని యర్థముగా బరిగణింపబడదు. ఉపయోగ సహితమైనది యర్థంబు కావచ్చును. తద్రహితమైనది వ్యర్థంబు.

అర్థంబువలన మనకు గలుగు సుఖంబు ద్వివిధంబు. తృష్ణ శమింపదేని బాధాగానుండునుగదా ! ఆబాధను నివారించుట యొకటి; ఇచ్ఛాపూర్తియైనందున సంతోషము జనియించుట రెండు. తృష్ణా శమనంబునకును సంతోషజననంబునకును అనుగుణమైనది యర్థంబు.

వాంఛ లుత్కృష్టంబులనియు నికృష్టంబులనియు రెండు విధములు. దేశమునకును దనకును వృద్ధికరములైన కోరిక లుత్కృష్టంబులు; కర్తవ్యములు కల్లుద్రావగోరుట, జూదమాడజూచుట మొదలగునవి నికృష్టములు. కావుననే యవి వ్యసనములు నాబడు.

ఈ తారతమ్యము మిక్కిలి ముఖ్యమైనదే యైనను నీతిశాస్త్రమునకు జేరినదికాని యర్థశాస్త్రమునకు సంబంధించినదికాదు. వాంఛల యుక్తాయుక్తతలను విచారించుట నీతిశాస్త్రపుబని. వాంచలెట్లున్నను