పుట:Bhaarata arthashaastramu (1958).pdf/235

ఈ పుట ఆమోదించబడ్డది

దేహమనోదార్ఢ్యంబులు సంఘమునకును సంబంధించినవి. వానియందు సంఘమునకుగల యాజమాన్యము మనుజునకులేదు.

ఒకవేళ సంఘముం జెందదని యనుకొందము. ఇండియాలో పాపకర్ము లనేకులుగలరు. మన జనసంఖ్య దాదాపు30 కోట్లు. అందెంతలేదన్నను 25 కోట్లు నికృష్టజీవులు. వీరందఱును గృతకృత్యులు గారుకాబోలు! మఱియు నిక్కలికాలములో మన శాస్త్రకారులు చక్కగ నిర్ణయించునట్లు ఇంచుమించుగ నెల్లరును నీతి బాహ్యులు, ఆచారవిదూరులునుగా నుండవలయును. లేకున్న నాశాస్త్రకారులకు ననృతదోషమువచ్చును. మనమేమైన నేమిగాని యేనాడో చచ్చి సున్నమైన ఋషులకు ననృతదోషము రాగూడదు! అట్లయిన మనమానము పోవును!

ఈయెగతాళి యటుండనిండు. మనదేశము నానాటికి క్షీణించుటయు ఐరోపాదేశము దినదిన ప్రవర్థమానమై తేజరిల్లుటయుంజూడ ఆత్మలు ఒకేదేశమున పున: పున: పుట్టవలయునను నిర్హేతుక కర్మము గలవనియైనననుసరే: లేదా, మనుజుల సుకృత దుష్కృతములు సంఘముం జెందునని యైననుసరే నిర్ణయించుటతప్ప వేఱుత్రోవ గానరాదు. బుద్ధిమంతు డెవ్వడును రెండవ తీర్మానమే సత్యమని యొప్పుకొనకపోడు.

నాకర్మములు ఇతరులం బట్టునుగాన నేనేలచెడ్డజేయగూడదు? చేసినచో నాకేమినష్టి? చేయనిచో నేమితుష్టి? యని వాపోవునంతటి మూఢులెవ్వరు నుండరని తోచెడిని. ఒకవేళ నుండిరిపో: వారి గర్హించు విధములేవన:-

1. తనచేసినకర్మ తన్ను బాధింపదని మేము చెప్పలేదు. ఇతరులను బాధించునంటిమి అంతటనే తనకు దప్పునని యర్థముచేయుట వెడగుదనము. తన్నును తనవారిని నాక్రమించుగాన పూర్వులు తలచినంతకన్న నెక్కువ ప్రభావముగలదిగా చూపింపబడినది గావున సత్కర్మాచరణమున కింకను బ్రబలహేతువు చూపింప బడియె.