పుట:Baarishhtaru paarvatiisham.pdf/82

ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతపెద్ద స్టీమరైతేమట్టుకు ఇవన్నీ ఎలా వుంటాయి? ఈ ఒక్కగదిమట్టుకు పైకిరాగానే దర్జాగా కనపడడానికి, ఇలా కుర్చీలూ బల్లలూ వేసి వుంచా రనుకున్నాను.

నేనక్కడ నిలుచుని ఊరికే ఇలా ఆశ్చర్యపోతూ వుంటే, ఒక పెద్దమనిషి వచ్చి నన్ను పలకరించాడు. నే నెక్కడికి వెడుతున్నానో అడిగి తెలుసుకుని, తను నేటాలు వెళ్ళుతున్నాననీ చాలా సార్లదివరకు వెళ్లాననీ దేశాటానము చాలా మంచిదనీ ఇంకా ఏమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పివల్ల అతను చెప్పేవన్నీ నా తల కెక్కలేదు. ఆపైన రోజ స్తమానమూ తిండి లేకపోవడమువల్ల కడుపులో దహించుకు పోతున్నది. రొట్టెలు కాల్చుకోడానికి ఓపికలేదు. పోనీ ఎలాగో శ్రమపడదామా అంటే వీలు కనబడదు. ఏమీ తోచడములేదు. వచ్చేటప్పుడు ఇంకా కాసిని యిడ్లీలూ అరటి పండ్లయినా తెచ్చుకొన్నాను కాను అనుకున్నాను. ఏమనుకుంటే ఏమి లాభము? ముందు దారేమీ కనబడదు. ఆ నేటాలువాడు వాడిదారి నేదో వాడు వాగుతున్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకుని కూచోమందా మనుకున్నాను.

మా స్టీమరు కూతకూసి బయలుచేరింది. ఇంతలోకే గంట ఒకటి వినబడ్డది. ఆ గంట ఏమిటా అనుకున్నాను. నాపక్కనున్న నేటాలు సోదరుడు భోజానానికి వెళుదాము రమ్మన్నాడు. నాకా మాటలు నమ్మబుద్ధికాలేదు. 'ఏమిటి, ఎక్కడికి ' అని రెట్టించి అడిగాను. 'భోజనాల హాలులోకి, భోంచేదా' మన్నాడు. వాడి మాటలు వింటే నాకు చస్తున్నవాడి నోట్లో అమృతము పోసినట్టున్నది. పోతున్న ప్రాణము వెనక్కువచ్చింది. దేవుడింకా