పుట:Baarishhtaru paarvatiisham.pdf/48

ఈ పుట ఆమోదించబడ్డది

తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. 'ఆపండోయ్ ' అని మళ్ళీ కేకలు వేస్తూ పరుగెత్తాను. ఓ మాటు ఆగినట్లే ఆగడము, మళ్ళీ పరుగెత్తడము, ఈలాగ సుమారు మైలు పరుగెత్తి ఆఖరుకు ఎలాగైతే నేమి అందుకున్నాను. యెక్కి ఒక్క క్షణము ఆయాసము తీర్చుకునే లోపలనే ఏ రంగోకూడా తెలియని అలుకు గుడ్డ లాంటి కోటూ, యిజారూ, తొడుక్కుని జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలుసంచీ ఒకటి తగిలించుకుని 'టికాయట్ సార్, టికాయట్ సార్, యెక్కడ పోవాలా ' అని ఒకడు వచ్చాడు. ఒక పావలా అతని చేతిలోపెట్టి మౌంటు రోడ్డన్నాను. 'ఏందయ్యా, యిందుకా యింతదూరము వోడివస్తివి? నిండా గట్టివాడు. యెందుకయ్య, దిగు దిగు జల్ది. బండి వస్తోంది. అందులో పోవాలయ్యా ' అన్నాడు అంటూండగానే యెదురుగా ట్రాముకారు యింకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము: యిప్పటికే చాలా ఆలస్యమైందని బండి అట్టే త్వరగా పోవడము లేదుకదా అనీ టిక్కట్టు యిచ్చే అతను ఆగమంటున్నా వినక కింద కురికాను. వురకడములో మొహము బద్దలయ్యేటట్టు ముందుకి పడ్డాను. ట్రాముకారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు నాలుగు చివాట్లువేసి వాళ్ళదారిని వాళ్ళు చక్కాపోయినారు. వీథిలోకి వచ్చేటప్పుడు, పొద్దుటి ఆ నల్లటి అరవాయన యెదురుగుండా వచ్చాడు. అందుకే యిలాటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను.

ఇవ్వాళ మరి ట్రాముకారు ఎక్కకూడ దనుకొని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకు వెళితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చు ననుకుని ఒంటెద్దుబండి ఒకటి కుదుర్చుకుని బయలు దేరాను.