పుట:Baarishhtaru paarvatiisham.pdf/41

ఈ పుట ఆమోదించబడ్డది

తీర్పు తీర్చడము మొదలుపెట్టారు. సరే వీడితో పేచీ ఎందుకని యింకొక పావలాకూడాయిచ్చాను. ముందు అదికూడా పుచ్చుకోనని నన్నూ, నా మొహాన్నీ, నా ముక్కునూ, నా మూతిని నా ధర్మగుణాన్నీ, తక్కిన ఆంధ్రులనీ, ఆంధ్రదేశాన్నీ కలిపి ఏకంగా తిట్టి ఆ అర్ధరూపాయి తీసుకొని చక్కా పోయినాడు.

ఒక దరిద్రము వదలింది కదా అని సంతోషించాను. ఇంక ఊళ్ళోకి వెళ్ళడముసంగతి ఎలాగా అనుకున్నాను. బండ్లవాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. 'ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా " అన్నాను వాళ్ళతో.

'ఉంది సామీ, కిట్టనే రామసామి మొదలి సత్రము ఉంది సామి.'

'అక్కడ గదులూ అవీ ఉంటవా, స్నానానికి దానికీ వీలుగా ఉంటుందా?'

'అంతా ఉండును సామీ, నిండా సౌకర్యముగా ఉండును సామీ.'

'మరి భోజనము సంగతి ఏలాగు?'

'దుడ్డు తీసుకుని అక్కడే వేస్తరు.'

భోజనము సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తారంటాడేమిటా అనుకొని 'అది కాదు. భోజనము హోటలు కూడా సత్రానికి దగ్గిర వుందా?' అన్నాను.

'అదిదా సామి, చెప్పితిని. సత్రములోదా అన్నముకూడా వేస్తరు. దుడ్డుమాత్రము తీసుకొందురు.'

అని అభినయరూపంగా వ్యాఖ్యానము చేసి నా బోటి అజ్ఞాను