పుట:Baarishhtaru paarvatiisham.pdf/33

ఈ పుట ఆమోదించబడ్డది

తప్పించుకుని తల్లిమీద పడ్డాను. మళ్ళీ ఆవిడా తోసెయ్య పోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టు కొన్నాను. రైలులో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడము ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్నూ తనభార్యని ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకముగా విడదీసి నన్ను తిట్టడము మొదలు పెట్టాడు. నా తప్పు ఏమీలేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియలేదనీ, తెలిస్తే అలా కౌగిలించుకోక పోయేవాడినే ననీ, ఇదివర కెప్పుడూ అల్లా చెయ్యలేదనీ, ఇక ముందెప్పుడూ చెయ్యననీ, గజగజ వణకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్ళంతా కూడా నన్ను చూచి జాలిపడి, నేను కౌగలించుకొన్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీలేదనీ, పొరపాటున కౌగిలించుకొన్నాననీ, పొరపాటెవ్వళ్లకయినా వస్తుందనీ, ఇవ్వాళ ఈయన అయినాడు, రేపు ఇంకొకళ్ళు కౌగలించుకో వచ్చు(పొరపాటున) ననీ, ఈ మాత్రము దాని కాయన అంత కోపపడవలసిన పనిలేదనీ ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్దమనిషిని శాంతింప జేశారు.

ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగలించుకొంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెము స్థలము ఇచ్చారు. పైబల్ల మీద నా పెట్టెపెట్టి దానిమీద మడత మంచమూ, చాపా, పెట్టి ఇవన్నీ కలిపి పైనగొలుసు కనబడితే, దానికీ వీట్లకీ, సాయంత్రము కొన్న చేంతాడు వేసి, లాగి, బిగించి కట్టాను. ఇంక సామాన్లకి ఫరవాలేదు గదా అని సుఖంగా కూర్చున్నాను.

ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు ఇద్దరూ మాపెట్టెలోకి వచ్చి గొలుసు