పుట:Baarishhtaru paarvatiisham.pdf/27

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ సామగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని, శుభదినము నిశ్చయించుకొని, వర్జము లేకుండా కూడా చూసుకొని శకునము మంచి దయ్యేవరకూ వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను.

మొగలితుర్రు, నర్సాపురము, ఇంకా చుట్టుపట్ల గ్రామములు రెండు మూడు తప్ప ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళిన వాడిని కాను. ఇంత కాలము నర్సాపురములో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరము లేకపోయింది. ఇవ్వాళ పడవలో కూర్చుని వెళ్ళుతూ ఉంటే మహా సరదాగా వుంది. స్టీమరు మీద వెళ్ళడ మన్నా యింతే కదా అనుకొన్నాను. రాత్రి దారిలో మినప రొట్టీ, సాతాళించిన సెనగలూ కొనుక్కుతింటూ ఇంగ్లండులో మినపరొట్టె ఉంటుందా, ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లండు నుంచి తిరిగివచ్చిన తరువాత ఏ విధంగా దేశోపకారము చేద్దామా అనుకుంటూ, నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది.

మెళుకువ రావడముతోటే నేను తలపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసము విడిచి త్వరగా స్టేషనుకు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్దమనిషిని సంబోధించి 'టిక్కెట్టు ఇవ్వండి త్వరగా' అన్నాను.

'ఏమిటా హడావిడి! ఎక్కడికి? ఏ రైలుకు?' అని ఆరంభించాడు ఆయన.

నేనెక్కడికి వెళ్ళితే ఎందు కాయనకు? నా వ్యవహారమంతా ఆయనతోటి చెప్పితే గుట్టు బయలు పడుతుందని--

'సరే అదంతా ఎందుకు లెండి ఇప్పుడు-టిక్కట్టు త్వరగా ఇప్పించండి ' అన్నాను.