పుట:Baarishhtaru paarvatiisham.pdf/12

ఈ పుట ఆమోదించబడ్డది

అని. చాలా తమాషాగా ఉంటుందనిపించింది. సరే, ఎంత ఖర్చు అయినా ఇంగ్లండు పంపించవలసిందే ననుకున్నాను. ఆరోజుల్లో ఇంగ్లండు వెళ్ళడమన్నా, బారిష్టరు చదవడమన్నా చాలా గొప్ప.

ఈ కుర్రవాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయమయిందో, ఆ తక్షణం అతని జన్మస్థానం పేరూ, ఇంటిపేరు, చదువూ, వగైరా అవసరమైన బాక్ గ్రౌండు వ్రాశాను. అంతవరకే నా బాధ్యత. తరవాత కథంతా పార్వతీశమే చెప్పుకుపోయాడు. మన పురాణకర్తలు, సూతుడు శౌనకాది మహామునుల కిట్ల నియె అనో; దేవా వైశంపాయనుడు జనమేజయున కిట్లనియె అనో కథ అందుకునే వారు. అప్పుడు దానంతటది కొంతదూరం సాగిపోయేది. డబ్ల్యు. డబ్ల్యు. జాకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచయిత, నైట్ వాచ్‌మన్ డెక్ మీద కూర్చుని ఇలా అన్నాడు అని అంటేనే కాని అతనికి కథ నడిచేది కాదట. అలాగే మాది మొగల్తుర్రు, మా ఇంటిపేరు వేమూరివారు అని స్వీయ చరిత్రలా ప్రారంభించేసరికి, తరువాయి చరిత్ర అంతా నా ప్రయోజకత్వం లేకుండా నడిచిపోయింది.

మొదటి నుంచీ నా బుద్ధికి మల్లేనే నాకాళ్ళకు కూడా స్థిరత్వం తక్కువ. తరచు తిరుగుతుంటేనే కాని తోచేదికాదు. ఈ కుర్రవాడిని మద్రాసులోనే