పుట:Baarishhtaru paarvatiisham.pdf/119

ఈ పుట ఆమోదించబడ్డది

కోడానికి చిరునవ్వుతో మరేమీ ఫరవాలేదు, భయపడకండి. తీసుకు వెళ్ళండి అన్నాను.

సరే మీ సామా నెక్కడుందో చెపితే పైకి తెప్పిస్తాను అన్నాడు దొర. ఫలానిచోట ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి, దయచేయండి వెడదాము అన్నాడు. దర్జాగా స్టీమరు దిగి బయటికివచ్చి బండి ఎక్కి తిన్నగా హోటలుకు వచ్చాము. హోటలు అంటే చెన్నపట్టణములోనూ కొలంబోలోనూ ఉన్నట్లు గానో అంతకంటే కొంచెము బాగానో ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకిచూస్తేనే చాలా పెద్ద మేడలాగ కనపడ్డది. ఇంతగొప్ప మేడ ఇదివరకెన్నడూ చూడలేదు. బండి ఆగగానే తమాషాగా వేషము వేసుకున్న మనిషి ఒకడు వచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడముతోనే కొంచెము తల పైకెత్తి ఇంకొకపక్కకి చూడడము మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాటు నావైపుచూసి నాతోటి ఉన్న దొరకేసి ఇలాంటివాణ్ని ఎందుకు తెచ్చావు, అన్నట్లుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగము కుంగిపోయూను. మేమిద్దరమూ దిగగానే నా సామానుకేసి చూసి ఇంక నక్కడ నుంచోకుండా హోటలు గుమ్మము దగ్గిరకు నడిచాము. వాడి వెనకాలే మేమూ నడిచాము. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలము ఇంద్రభవనము లాగనే వుంది. ఎరక్కపోయి పెద్ద హోటలుకి తీసుకువెళ్ళమన్నాను, ఎంతడబ్బు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రిమొహము వేస్తే ఏమి లాభమనుకుని నా జీవితమంతా ఇటువంటి హోటలులోనే గడిపినట్లుగా దర్జాగా నడవడము మొదలు పెట్టాను. నా తోటి వచ్చిన దొర అక్కడున్న