పుట:Baarishhtaru paarvatiisham.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

పోస్టాఫీసు కనపడ్డది. అందులోకి వెళ్ళి ఒక కార్డుకొని నేను క్షేమంగా వున్నానని ఇంటికి ఒక వుత్తరం రాసి పోస్టులోవేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో వున్నితోటి తయారుచేసిన రెండుజానల వెడల్పుగల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశం గదా! ఇది ఒకటి కొనుక్కుంటే, చెవులకు చుట్టుకున్నా మెడకి చుట్టుకున్నా వెచ్చగా వుంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా వున్నాయి అని ఒక్కటి కొన్నాను. అక్కడ ఒక కాఫీహోటలు కనబడితే వెళ్ళి కాస్త ఫలహారము చేసి నిమ్మళముగా మళ్ళీ స్టీమరు చేరుకున్నాను. సాయంత్రం ఏడు గంటలకి స్టీమరు బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే వుంది. కాని పొద్దుటి నుంచీ ఆరంభించింది నావస్థ. అది వికారముగాదు. అవి వాంతులుగావు. లోపలినుంచి డోకు వస్తూన్నట్టుండడమే గాని పైకి ఏమీ కాకపోవడము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ళనుంచీ కులాసాగా తిరుగుతోన్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండిలేదు సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలాచేస్తున్నారంటే తుఫాను వుంది. కిటికీ తలుపులు తీసి వుంటే నీళ్ళు లోపలికి వస్తాయన్నారు.

ఇలా సుమారు వారం రోజులు రాత్రింబగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమీ తోచక గడియారము చూస్తూవుంటే కొంత కాలక్షేపం అవుతుందని, గడియారము తలక్రింద పెట్తుకుని అస్తమానమూ చూచుకుంటూ వుండేవాడిని. మొదటి రోజు