ఈ పుట ఆమోదించబడ్డది

36

అతిబాల్యవివాహము

హముతో సమాజము లేర్పరచి ప్రసంగములు చేసి ధైర్యముతో దురాచారములను దూషింపఁ గలిగియు, వివాహమై భార్యకాపురములకు వచ్చిన రెండుమూడు సంవత్సరములలోపలనే తమ పూర్వావస్థ నంతను మఱచిపోయి తొంటియుత్సాహముచెడి దీనముఖములు గలవారయి, దేశాభిమాన మన్నమాటను స్మరణకు తెచ్చుకొనక, తొంటి ప్రసంగములను సమాజములను విడిచిపెట్టి, ధైర్యసాహసములను స్వాతంత్ర్యమును కోలుపోయి, ఎవ్వరియడుగులకు మడుగు లొత్తియైనను ఎన్ని యిచ్చకము లాడియైనను నెలకు పదియేనురూపాయలపని సంపాదించి లంచములు పుచ్చుకొనియో కల్లలాడియో తమ భార్యాపుత్రులను పోషించుటయే పరముర్థమని సిద్ధాంతము నేర్పఱుచుకొని, లోకము నిమిత్తము పాటుపడఁదలఁచినవారిని జూచి పరిహసించుచు వారిని నిరుత్సాహపఱిచి, తాము లోకములకు నిష్ప్రయోజకు లగుచున్నారు. పురుషులగతి యిట్లుండఁగా వారి భార్యల కింకొకదురవస్థకూడ ప్రాప్తించుచున్నది. ఆచిన్నది మగనికొలువు మాత్రమేకాక అత్తగారికొలువుకూడ చేయవలసియుండును. సాధారణముగా మగఁడింటఁ గూరుచుండి సుఖభోజనము చేయుచుండు పరాధీనుడుగా నుండుటచేతను, తన్నుమాత్రమేకాక తనభర్తను కూడ పోషింపవలసినవా రత్తమామలే యగుటచేతను, అత్తమామలకుఁ బూర్ణముగా కోపమువచ్చిన పక్షమున ఇంట నిలుచుటయే పొసఁగనేరదు గనుకను, బాలభార్య మగనికంటె అత్తమామలకే యెక్కువలోఁబడి వారికే యాజ్ఞానువర్తినిగా నుండవలసిన దగుచున్నది. ఈ హేతువునుబట్టి బాలభార్యలు పలువురు మగలమనసుల కెడయై యావజ్జీవమును సుఖ మెఱుఁగనివా రగుచున్నారు. అదిగాక అత్తలకు కొందఱకు కారణమున్నను లేకపోయినను కూడ కోడండ్రను బాధించునప్పటికంటం నధిక సంతోషము మఱియెప్పుడును కలుగదు.