పుట:Arindama Vijayamu By Ikkurti Tirupati Rayudu (Telugu, 1923).pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంపాదకీయభూమిక

అపరాధపరిశోధకనవల లెన్నేని వెలువడినవి. వెలువడుచున్నవి, వెలువడనున్నవి, కాని నాటకము లింతవరకట్టివి వెలువడియుండలేదు. ప్రస్తుతకాలమున కుత్సాహజనకము నత్యంతావశ్యకమగు అరిందమవిజయమను నిరూపకనాటకమును "వాఁడే వీఁడు" అను నవలను మాతృకగాఁ గొని స్వల్పమార్పులతో ప్రదర్శనానుకూలముగా మా మిత్రులగు శ్రీ బాలకవి ఇక్కుర్తి తిరుపతిరాయఁడుగారు రచించి మాగ్రంధనిలయమునకు, ద్వితీయభూషణముగ నొసంగిరి.

రహస్యాపరాధపరిశోధితమును దృశ్యానుకూలముగ రచించుట మిక్కిలి కష్టమైనను సాధ్యమైనంతవర కేలోటును రానీక కథాచమత్కృతి యంతయుఁ జక్కనిశైలిని నింపిరి, ఇందు బిన్నౌత్, కేశవచంద్–పూల్ సాహేబ్ అనునామములతో జేయుదుశ్చేష్టలు —అరిందముని పరిశోధనాప్రవీణత్వము జుమీలియామాయలు—— గౌరియొక్క గడుసుదనము రేవతీ మనోనిశ్చయము మొదలగునవన్నియు పాత్రోచితములుగ నిలుపఁబడినవి.

దేశభాషాభిమానుల సమాదరప్రోత్సాహములచే దేశభక్తివిలసితములగు ఇట్టినాటకములు, నవలలు, ప్రబంధములు మొదలగు ఉద్గ్రంథములు క్రమక్రమముగఁ బ్రకటింప నుద్యుక్తులమైయున్నాము.

మాయుద్యమమున కెల్లవిధములఁ దోడుపడుచు నిలయమునం దాదరాభిమానములం జూపుచున్న గౌరవపోషకులును, సంవత్సరపోషకులును, చందాదారులును, భాషాభిమానులు నగు నాంధ్రసోదరులెల్లరును భాషాసేవఁ జేయుచున్న యీగ్రంథనిలయమున కనవరతాభ్యుదయపరంపరలం గూర్చెదరుగాక యని నమ్ముచున్నారము.