పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/22

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 18

రామా -- ఈసోదియేమిటి? నీవు ఇప్పుడు పడిపోయినట్టు వంటరిగాయెందుకు వచ్చినావు?

శ్యామ -- మీరుదాచఁబోకండి. మీకథంతా నేనువిన్నాను సుమా.

రామా -- (తనలో) మోహినిమాట యెవరూ చెప్పలేదుగద. (ప్రకాశముగా) కథంతా విన్నావా? ఏకథవిన్నావు?

శ్యామ -- తాచుపాముకాటు బ్రతికినా చచ్చినా నాలుగు ఝాములలో తెలుస్తుంది. నాకు భూమిలో పసుపు కుంకుమూ పెట్టుకొని అయిదోతనం చెయ్యవలసినయోగంవున్నదిగనుక నాపుణ్యం చేత మీరు సజీవులయి తేరుకున్నారు. మీరు చెప్పకపోయినా నాకు యీవుత్తరంచెప్పినది. (అని వుత్తరం చేతికిచ్చు చున్నది.)

రామా -- (ఉత్తరము పుచ్చుకొని చదువుచు) ఎవడురా యీ వుత్తరంవ్రాసినదుర్మార్గుడు? నాకు రాత్రితోటలో తాచుపాము కరిచిందట! నేను స్పృహతెలియకుండా పడివున్నానట! నేను బ్రతుకుతానో లేదో తెలియదట! దీనికింద దస్కతులేదు. కరటకా! యీ దస్తూరీయెవరిదో నీవు చెప్పగలవా! (అని చూపుచున్నాఁడు.)

కర -- యీదస్తూరి నాకుయెంతమాత్రము తెలియదు. ఇది కొత్తవ్రాత. (తనలో) తన పెళ్ళాముతో యీయన తిరగడానికి వేగ లేక గుమాస్తా భీమారావూ నేనూ కలిసివ్రాసినవుత్తరం వూరికేపోలేదు. తగినపని చేసింది.

శ్యామ -- అది దొంగవుత్తరమయినందుకు నాకు సంతోషంగా వున్నది. మీకేమితొందర కలుగ లేదుగదా?

కర -- పాముకాటు మహాచెడ్డది. దానివల్ల యెంత అపాయమయినా వున్నది. ఈయన యెప్పుడూ భార్యనువిడిచి వంటిగా వుండకాడదు.