పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 13

రామా -- అలాగైతే యీచిన్నది సుఖంగా వున్నదని నీవు పరుగెత్తుకొనిపోయి చెప్పిరా.

కర -- (తనలో) నాకు మతిపోతూవున్నది. ఇప్పుడేమి చెయ్యడానికీ తోచకుండావున్నది. తొందరపడి యేమయినాచేస్తే నాపనికి నీళ్ళువదులుకోవలెను.

[మిఠాయ పొట్లము పట్టుకొని వెంకఁడు ప్రవేశించుచున్నాఁడు.]

వెంక -- రెడ్డిగారూ! ఇదిగో మిఠాయి తెచ్చినాను.

కర -- (తనలో) వీడుకూడా సమయానికే వచ్చినాడు.

రామా -- వెంకా! పొట్లము యిలాతీసుకొనిరా. ఇది మాకోసము. అని (పుచ్చుకొనుచున్నాఁడు) ఓరీ! నీవు వెళ్ళి బండివాణ్ని బండికట్టి సిద్ధముగా వుంచుమనిచెప్పు.

వెంక -- రెడ్డిగారి సెలవుప్రకారం నేను యిదివరకేచెప్పినా నండి. బండివాఁడు యెడ్లను కడుతూవున్నాఁడు.

రామా -- (కరటకరెడ్డివంక చూచి) ఓరిదొంగా! నీవన్నీ ఇదివరకే యేర్పాటు చేసినావు! అందుచేతనేనా నేనువెళ్ళుమంటే వెళ్ళక యేమీయెఱగనట్టు నటిస్తూనిలుచున్నావు? ఎప్పుడో జరగబోయేదంతా నీవు ముందుగానే కనిపెట్టి అన్నీ చెప్పకమునుపే జాగ్రతపెడుతూ వున్నావే. అన్నీ సరేకాని తల్లియింటికాడ విచారిస్తూవుండకుండా నీకూతురు భద్రముగావున్నదని నీవు ముందుగా పోయి చెప్పిరావలెను. వేగిరం వెళ్ళు.

కర -- ఈ వెంకణ్నిపోయి చెప్పిరమ్మనరాదా?

రామా -- ఈపనికి వెంకడు పనికిరాడు. వెంకణ్ని వేరేపని మీద పంపవలెను. ఇందుకు నీవేతగినవాఁడవు. నీవు అబద్ధాలు మహా బాగా చెప్పగలవు. నీశక్తిమఱియెవరికీరాదు. సమయోచితంగా నిమిషంలో కథకల్పించి నమ్మేటట్టుగా నీవు బొంకుతావు. వెంకా! నీవు పళ్ళెములో తమలపాకులువేసి పట్టుకునిరా.