పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 12

రామా -- (కరటకరెడ్డిని వెనుకకుతోయుచు) ఆపని కాకపోతే మరివకపని చెపుతాను. ఈచిన్నది నేటినుంచీ పనిలోవున్నట్టే.

కర -- (పని యొప్పుకోవద్దని వెనుకనుండి సైగచేయు చున్నాఁడు.)

మోహి -- నాకుపనివద్దు.

రామా -- నీయిష్టమైనపని చెయ్యవచ్చును. నీ కేపని చేత నవునో చెప్పు.

మోహి -- నాకేపనీ చేతకాదు.

రామా -- ఏపనీచేతకాకపోతే, తోటమాలీ పువ్వులచెట్లకు నీళ్ళుపోస్తూవున్నాఁడోలేదో చూస్తూవుందువుగానిలే. మీరు రేపు వచ్చి మాయింట్లోప్రవేశించండి. కరటకా! నీవు యీరాత్రే మన తోటయిల్లు ఖాళీచేయించు.

మోహి -- మాయింటికి భోజనానికి వెళ్ళవలెను. నన్ను పోనియ్యండి.

రామా -- నీకు తినడానికి పంచదార మిఠాయి తెప్పిస్తాను. వక్కనిముషంవుండు. మనము యిద్దరమూ తిందాము. కరటకా! నీవు పరుగెత్తుకొనివెళ్ళి వకవీసెడు పంచదార మిఠాయి పట్టుకునిరా.

మోహి -- నేను మాఅమ్మను అడిగిరావలెను.

రామా -- నేను నిన్ను బండిలో తీసుకునివెళ్ళి మీయింటివద్ద దిగబెట్టివస్తానులే. తొందరపడకు. కరటకా! కదలవేమి? వేగిరము మిఠాయీ పళ్ళూ తీసికొనిరా.

కర -- (తనలో) నాకు చావుగావున్నది. (ప్రకాశముగా) మోహినితల్లియింటివద్దకనిపెట్టుకొని వుంటుంది. కూతురు వేగిరం రాకపోతే యేమి అపాయంజరిగిందో అని ముసలిది యేడిచిపోతుంది. ఈచిన్నదాన్ని వేగిరంపంపించి వెయ్యండి.