పుట:Apoorva Brahmacharya Prahasanamu - Kandukuri Veeresalingam.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అపూర్వబ్రహ్మచర్య ప్రహసనము 7

వెంక -- అలాగే చేస్తానుకానండి నీళ్ళులేక పువ్వులచెట్లు చచ్చిపోయినవని రేపు పంతులుగారు కోపపడితేనో-

కర -- నాదగ్గిర యెదురుమాటచెప్పక చెప్పినట్టుచెయ్యి. నీకు కొత్తగనుక యింకా తెలియలేదుగాని నాఆజ్ఞ అంటే పంతులు గారి ఆజ్ఞకంటేనూ యెక్కువ. పంతులుగారికి కోపమువచ్చినా నీవు పనిచెయ్యగలవుగాని నాకు కోపంవస్తే వక్కనిమిషం పనిచెయ్య లేవు. పంతులుగారు నిన్ను అంతగా అడిగితే నేను పనిమీద పంపించినానని చెప్పు.

వెం -- చిత్తము. చిత్తము.

కర -- ముందుగాపోయి మిఠాయి తీసుకునిరా. పో.

వెంక -- పణసతొనల మిఠాయా? (అని వెళ్ళుచున్నాఁడు)

కర -- నేను యీవాళ నాయజమానుడి కంటెనూ యెక్కువగా వుంటాను. ఈపాటి మోహిని వస్తూవుంటుంది. యెవరో వస్తూ వున్నట్లు అడుగుల చప్పుడవుతూ వున్నది. అది మోహినే అయివుండును. కాదు బూట్సు చప్పుడులాగువున్నది. అదియేమి నాయజమానుఁడు మళ్ళీ వస్తూవున్నాడు! అయ్యో! దైవమా! ఏమి యీ దురదృష్టము! ఇప్పుడు మోహినివచ్చి యితనికంటపడితే నా కాపురం కూలిపోయిందే, ఇఖ నేను సంసారానికి నీళ్లువదులుకోవలెను. నేను యేదోపని కల్పించుకొని వీధిలోకి వెళ్ళి నా పెళ్ళామును రా వద్దని చెప్పివస్తాను. ఈలోపుగా మిఠాయి పట్టుకొని వెంకడు రాడు గదా?

[అప్పుడు రామాకాంతము పంతులు ప్రవేశించుచున్నాఁడు]

రామా -- కరటకా!

కర -- (ఎవ్వరయిన వచ్చుచున్నా రేమోయని గుమ్మంవంక చూచుచు) అయ్యా! ఏమి! మీరువెళ్ళినారుకారేమి?