నాల్గవ ప్రకరణము
సూక్ష్మజీవు లెట్లు ప్రవేశించును? ఎట్లు విడుచును?
పైని వివరించిన అంటువ్యాధులలో కొన్ని ఒకరి నొకరు తాకుటచేతగాని, వ్యాధిగ్రస్తులుండుచోట్ల సహవాసముగా నివసించుటచేతగాని కలుగవచ్చును. ఇందు కొన్ని వ్యాధులను కలిగించు సూక్ష్మజీవులుగల ద్రవమును రోగి నుండి ఎత్తి గాయముగుండనైనను మరి యేవిధముచేతనయినను మరియొకరి శరీరములోని కెక్కించినయెడల రెండవ వారి కావ్యాధి పరిణమించును. మరికొన్ని అంటువ్యాధులు రోగు లుపయోగపరచిన నీళ్లు మొదలగు పదార్థముల మూలమున ఒకరినుండి మరియొకరిని జేరును. రోగులు విసర్జించు ఆహారపదార్థములు మలమూత్రాదులు బట్టలును, రోగులు తాకిన చెంబులు మొదలగు పదార్థములును, రోగుల వద్దనుండి సూక్ష్మజీవులను వాని గ్రుడ్లను ఇతరస్థలములకు జేర వేయుటకు సహాయపడును. ఇవిగాక కండ్లకలక మొదలగు మరికొన్ని అంటువ్యాధులు దోమలు ఈగలు నుసమలు మొదలగు జంతువుల మూలమున మనశరీరములో ప్రవేశించును. మరికొన్ని అంటువ్యాధులు రోగులుగలచోట్ల నివసించి నంతమాత్రముననే అంటుకొనును. మన శరీరములోని రక్త