ఈ పుట ఆమోదించబడ్డది

126

పండ్రెండవ ప్రకరణము


మకాములలో వ్యాధిగ్రస్తులు, వ్యాధిలేనివారు కలసియుండుట చేత నిక్కడ క్రొత్తవారికి వ్యాధి యంకురించి మనకు తెలియకయే వా రితర ప్రదేశముల కా వ్యాధిని గొనిపోవచ్చును.

3. బలవంతపు మకాములలో బాటసారులకు భోజనాది సౌకర్యము లమర్చుట బహుకష్టము. అందుచే బడలియున్న బాటసారుల నీ యంటువ్యాధు లధికముగ బాధింపవచ్చును. కావున నిట్టి బలవంతపు మకాములచే ప్రజలను భీతిజెందించుటకంటె ప్రజలకు అంటువ్యాధియొక్క వ్యాపకమును వాని నివారణ పద్ధతులనుగూర్చి విషయములను బోధించుటకు సులభ శైలిని వ్యాసములు వ్రాసి విరివిగ పంచి పెట్టి ప్రజలకు వానియందు విశ్వాసము కలుగునట్లు చేయవలెను. అంటువ్యాధిగల చోట్ల కితర దేశములయందలి ప్రజలు పోకుండ వారికి బోధింపవలెను. అంటువ్యాధిగల ప్రదేశము లనుండి వచ్చువారల కందరకు రహదారిచీటి (Passport) నొకదానినిచ్చి వారు ప్రతిదినము సర్కారు ఉద్యోగస్థుని పరీక్షలో నుండునట్లు తగు యేర్పాటుచేయవలెను. క్రొత్త ప్రదేశములలో నెక్కడనైన ఈ వ్యాధివచ్చినయెడల నీ రహదారి చీట్లమూలమున వెంటనే కనిపట్టవచ్చును. వారిని ప్రత్యేకముగా గ్రామమునకు తగినంత దూరములోనుంచి చికిత్సచేసి వ్యాధి యూరూరునకు వ్యాపింపకుండ చేయవచ్చును. ప్లేగు రహదారిచీట్లును బాటసారుల కిచ్చు నుద్దేశమిదియె.