ఈ పుట ఆమోదించబడ్డది

84

తొమ్మిదవ ప్రకరణము


ఈ నెత్తురుచుక్కయొక్క పటమును చూచినయెడల పెక్కులుగ గుండ్రని బేడకాసుల దొంతరలవలెనున్న కణములును అక్కడక్కడ వివిధాకారములుగల కొంచెము పెద్దకణములు చూడనగును. ఈ తెల్లకణములు నెత్తురులో నున్నప్పుడు కొంచెము నీలపు రంగుకలిగిన యుండలవలె కనుపించును. ఈ యెర్రకణములును తెల్లకణములునుగాక రక్తములో వీని కాధారమగు ద్రపదార్థముగలదు. ఈ ద్రపదార్థమునకు రసము (Serum) అనిపేరు. ఈ రసములో తేలుచు నెత్తురు కాలువలో నీకణములుకొట్టుకొని పోవుచుండును. ఇందు రమారమి 500 ఎర్రకణములకు ఒక తెల్లకణము చొప్పుననుండును. ఎర్రకణములు ఊపిరి తిత్తులలోనికిపోయి ప్రాణవాయువును తెచ్చి శరీరమునకిచ్చుచు నక్కడనుండి అంగారామ్ల వాయువు (Carbonic Acid Gas) తీసికొనిపోయి ఊపిరిగాలి గుండ బయటికి విడిచివేయును.

తెల్లకణములు

తెల్లకణములలో 5 భేదములుకలవు. సాధారణముగ నన్నికణములలోవలె ఈ కణములన్నిటియందు మూలపదార్థమును జీవస్థానమును నుండును. వీనియందలి భేదముచేతనే తెల్లకణములో నీ యయిదు భేదము లేర్పడినవి. ఈ ప్రక్కనున్న 28-వ పటమును జూడుము.