ఈ పుట ఆమోదించబడ్డది

విజ్ఞాన చంద్రికా గ్రంధమాల.



నియమములు.

1. దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంథములు ప్రచురించి భాషాభివృద్ధి చేయుటయే యీ గ్రంధమాల యొక్క యుద్దేశ్యము. ఇందు సంవత్సరమునకు రమారమి 1600 పుటలుగల స్వతంత్రమైన గ్రంథములు ప్రచురింపఁబడును.

2. కొందఱు తలచునట్లు ఇది మాసపత్రిక కాదు. ఇందు దేశదేశముల చరిత్రములును, పదార్థవిజ్ఞాన, రసాయన, జీవ, వృక్ష, మొదలగు ప్ర్రకృతిశాస్త్రములును, దేశోపకారులగు, కొందఱు మహనీయుల చరిత్రములును, ఇంగ్లీషునందలి ఉద్గ్రంథముల భాషాంతరీకరణములును మాత్రము ప్రచురింపఁబడును. చరిత్రానుసారములగు కల్పిత కథలు Historical Novels గూడ ప్రచురింపఁబడును.

3. ఈ గ్రంథమలాలలో నిదివరకు అచ్చు వేయఁబడిన గ్రంథముల నన్నిటిని కొనుచు, నికముందు సంవత్సరమునకు నాలుగు చొప్పున ప్రచురింపఁబడు గ్రంథముల నన్నిటినిగొనుటకు నొప్పుకొనువారు శాశ్వతపు చందాదారులు.

4. శాశ్వతపు చందాదారులకు ఈ గ్రంథమాలలోని గ్రంథములన్నియు అర్ధ వెలల కియ్యబడును. సంవత్సరము ఒక్కంటికి 1600 పుటలకంటె నెక్కువ పుటలుగల గ్రంధములు మేము ప్రచురించము. చందాదారులకు సంవత్సరమునకు ర్పూ. 4-0-0 కంటె నెక్కుడు కర్చుకానేరదు.