ఈ పుట ఆమోదించబడ్డది

"ఏ దిక్కు చూచినను రెండు మైళ్ళ పొడవున నీటి నాళములును (Fountains), తోటలు నుండెను. వాటిలో మామిడి, అరటి, పనస లుండెను. పువ్వులన్నియు హిందూ పుష్పాలే. చంపకము, మొగలి, మల్లెపూ లుండెను, [1] నగరము పేటలుగా విభజింపబడి యుండెను. అక్కలవాడ, భోగంవీధి, వలిపాళెము, మేదరవాడ, మోహరివాడ, దేవాలయములు, రాజభవనాలు పూటకూటియిండ్లు మున్నగున వుండెను."

కాకతీయుల జైనులుగా నుండినప్పుడు జైన దేవాలయములు కట్టించిరి. హనుమకొండ గట్టురాళ్ళపైన కూడా పెద్ద జైనతీర్థంకరుల విగ్రహాలను చెక్కిరి. అదే గుట్టపై పద్మాక్షి దేవాలయము కలదు. దానిని తర్వాత శైవులు లాగుకొని తమ దేవతగా పూజలు చేయించుతూ వచ్చినారు. గుట్టవద్దగల చెరువులో అనేక జైన విగ్రహాలు మంచివి విరిగినవి, శకలములు నేటికిని కుప్పగా వేయబడినవి కానవచ్చును.

తర్వాత కాకతీయరాజులు శైవులయిరి. అప్పుడు వారు హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయమును నిర్మించిరి. అదిగాక ఆంధ్రనగరములో అనేక సుందర శిల్పసమాయుక్త దేవతాయతనములు నిర్మాణమయ్యెను. కాని తురకలు వాటిని నాశనము చేయగా మనకీనాడు విచారము, దు:ఖము, శిల్పశకలములు, మాత్రమే మిగిలినవి. ఓరుగంటికి 40 మైళ్ళ దూరమున "రామప్ప గుడులు" కలవు. వాటిని క్రీ.శ. 1162 లో రుద్రసేనాని అను రెడ్డి సామంతుడు కట్టించెను. ఆ గుళ్ళలోని విగ్రహములు, స్తంభాలపై శిల్పములు, ముఖ్యముగా దేవాలయ మంటపముపై కోణములందు నాలుగుదిశలందు నిలిపిన పెద్ద నల్లరాతి నాట్యకత్తెల విగ్రహాలు అతి సుందరములు. ఆ విగ్రహాలపై సొమ్ముల అలంకరణములు, వాటి త్రిభంగీ నాట్యభంగిమము శిల్పకారులనే మోహింపజేసినట్లున్నది. అందుచేతనే శిల్పులు ఆ సుందరాంగులకు తుష్టిపూర్తిగా ప్రసాధన క్రియలను సమకూర్చి అందు రెంటిని నగ్నముగా తీర్చిదిద్ది ఆనందించినారు. దేవాలయములోని స్తంభాలపై నాట్యభంగిమములు మృదంగాది వాద్యములవారి రేఖలు చిత్రింపబడినవి. ఆ కాలములో జాయసేనానియను

  1. నూహెసిసెహర్ అమీర్ ఖుస్రూ.