ఈ పుట ఆమోదించబడ్డది

      "...వేదభరాక్రాంతు లనగ
       బడిన బ్రాహ్మణ గార్దభంబులతోడ" [1]

ఇంతటితో ఆగలేదు. కర్మచండాలురు, వ్రతభ్రష్టులు, దుర్జాతులు, పశుకర్ములు, బాపనకూళలు. అని నానావిధముల బ్రాహ్మణులను తిట్టినారు. హిందువులను కలకాలము వదల నొల్లని కులతత్త్వము ఈ శైవవైష్ణవులవలన కాకతీయరాజ్య పతనానంతరము స్థిరపడి, మరికొన్ని కొత్తకులముల కూనల లేవదీసెను. శైవులలో లింగాయతులు, బలిజలు, జంగాలు, తంబళ్ళు మున్నగు కులా లేర్పడెను. వైష్ణవులలో నంబులు, సాత్తానులు, దాసర్లు మున్నగు వారేర్పడిరి. శైవులు మతము పేర బసివిరాండ్రను జన్న విడిచిరి. బసవనిపేర స్త్రీలను పెండ్లిచేయక వదలి వారిని వ్యభిచారిణులనుగా జేసిరి. వైష్ణవులు కూడా ముద్రలువేసి దేవదాసీలను సిద్ధము చేసిరి. కాకతీయానంతర కాలములో శైవులు చాలమంది వైష్ణవులైరి. అందు ముఖ్యులు రెడ్లు.

కాకతి ప్రోలరాజు వరకు కాకతీయులు జైనులయై యుండిరి. ప్రోలరాజు కుమారుడు శైవుడయ్యెను. కాకతి యే దేవతగా నుండెనో ఆకాలమునాడే సరిగా ఎరుగరు. "కాకత్యా: పరాశక్తే: కృపయా కూష్మాండవల్లికా కాచిత్ | పుత్ర మసూత తదే తత్కుల మనఘం కాకతి సంజ్ఞమభూత్॥ " అని కలువచేరు శాసనములో వ్రాసిరి. కాకతీయులు క్షత్రియులు కారని విద్యానాథుడే వ్రాసెను.[2]

కాకతీయులు శైవులైన తర్వాత జైనులను హింసించి యుండవచ్చును. "అనుమకొండ నివాసులయినట్టి బౌద్ధజైనుల రావించి వారిని తిక్కన మనీషితోడ వాదింపజేసెను." అని గణపతి దేవుని గూర్చి సోమదేవ రాజీయములో నున్నది. తిక్కన తన నెల్లూరి ప్రభువగు మనుమసిద్ధికి సహాయార్థమై ఓరుగంటికి వెళ్ళి గణపతిరాజు సాయము వేడెననియు ఆ సందర్భములో నతడు జైనబౌద్ధుల నోడించె ననియు పై గ్రంథము తెలుపుతున్నది. తిక్కన సోమయాజి పటువాక్య శక్తికి గణపతి మెచ్చుకొని "జీనసమయార్థుల శిరముల దునిమి విద్వేష బౌద్దుల విలుమాడి..."[3] నానాహింసలు చేసెనట. ఈ విషయములను బట్టి ఈ ప్రకరణాదిలో తెలిపినట్లుగా కవిత్రయమువారు కేవల భాషా

  1. పాల్కురికి బసవపురాణము పు 225
  2. 'అత్యర్కేందు కులప్రశస్తి మనృజత్‌'... ప్రతాపరుద్రీయము.
  3. పండితారాధ్య చరిత్ర, మొదటి భాగం పుటలు 506, 507.