పుట:Andrulasangikach025988mbp.pdf/422

ఈ పుట ఆమోదించబడ్డది

ఈ ప్రజాయుగంలో వెలవడవలసినవి ప్రజాచరిత్రలు. వీటికే మరొక పేరు-"సాంఘిక చరిత్రలు".

నామమాత్రానికి మన దేశంపై ప్రస్తుతం బ్రిటిష్ రాజుకు మిగిలివున్న పెద్దరికంకూడ తొలగిపోనున్న ఈ సమయంలో, కొన్ని శతాబ్దాల తర్వాత ఆంధ్రులకు తిరిగి ఒక ప్రత్యేక ప్రభుత్వం ఏర్పడనున్న ఈ సమయంలో ఇట్టి ఒక చరిత్ర గ్రంథం వెలువడ్డం ఎంతైనా సమయోచితం.

దాదాపు వెయ్యి సంవత్సరాలపాటు (క్రీస్తుశకం 1050 నుంచి 1907 వరకు) తెలుగుజాతి ఏ విధంగా బ్రతికిందో ఈ చరిత్ర కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తున్నది. మన తాత, ముత్తాత లెట్టివారై యుండిరో; మన అవ్వలు ఎట్టి సొమ్ములు దాల్చిరో, యెట్టి అలంకరణములతో నుండిరో మన పూర్వు లే దేవరలను గొలిచిరో, ఏ విశ్వాసాలు కలిగి యుండిరో, ఏ యాటపాటలతో వినోదించిరో, దొంగలు, దొరలు దోపీడీలు చేసినప్పుడు క్షామా దీతిబాదలు కలిగినప్పు డెటుల రక్షణము చేసుకొనిరో; జాడ్యాల కే చికిత్సలు పొందిరో, ఎట్టి కళలందు ప్రీతి కలవారై యుండిరో, ఏయే దేశాలతో వ్యాపారాలు చేసిరో"-ఇట్టి అనేక విషయాలు ఈ చరిత్రలో వర్ణితం.

తప్పెట్లు, కాహళములు, కాలి కొమ్ములు, డమాయీలు, బూరలు, శంఖములు, సన్నాయీలు, డోళ్లు, రుంజలు, చేగంటలు-ఇవి చేరగా ఏర్పడినదే మన పూర్వీకుల మిలిటరీ బ్యాండ్.

తుమ్మెదపదాలు, పర్వతపదాలు, శంకరపదాలు, నివాళిపదాలు, వాలేశుపదాలు, వెన్నెలపదాలు, రోకటి పాటలు, బొమ్మలాటలు, కోలాటం, గొండ్లి, చిందు,జక్కిణి, పేరణీ, ప్రేంఖణము, ఉప్పెన పట్టెలాట, బొంగరాలాట, కోళ్ళపందెము, పులిజూదం, పచ్చీసు, సిడి - ఇవి మన పూర్వీకుల గాననృత్య క్రీడావినోదాలు.

ముక్కర, నెత్తిబిళ్ళలు, దండెకడెములు వంకీలు, జోమాల దండలు, తాటంకములు, ముత్యాల కమ్మలు, కాంచీ నూపురకంకణములు, త్రిసరములు, మొరవంక కడియములు, వడ్డాణము, ముక్కు నత్తు - ఇవి మన అవ్వలు పెట్టుకొన్న నగలలో కొన్నిమాత్రం.