పుట:Andrulasangikach025988mbp.pdf/408

ఈ పుట ఆమోదించబడ్డది

గొప్ప మార్పులు

ముసల్మానుల కాలములో హిందువులందు మార్పు ఎక్కువగా కానరాలేదు. ముసల్మాను ప్రభువులు ఇస్లాం వ్యాప్తికి, హిందూవినాశనానికి అందరున్నూ (అక్బరుతోసహా) పరిశ్రమించినవారే. పైగా హిందువుల అభివృద్ధికి కావలసినన్ని నిరోధాలు శాసించిరి. జహంగీరు, షాజహాన్, ఔరంగజేబు దేవాలయ నిర్మాణాలకు సెల వియ్యలేదు. ముసల్మానులయినవారు తిరిగి హిందువులయితే ఘోర శిక్షల నిచ్చుచు, నిరోధక శాసనాలు చేసిరి. ఔరంగజేబు బళ్ళను కూడా పెట్టుకొన నియ్యలేదు. హిందువులకు కొన్నితప్ప ఏ యుద్యోగాలున్నూ ఇయ్యలేదు. కావున హిందువులలో మార్పు కానరాలేదు.

ఇంగ్లీషువారు తా మధికులమని వచ్చిరి. ఈ సమీక్షాకాలములో దేశీయుల కుద్యోగా లియ్యకపోయిరి. తమ ఆచార వ్యవహారాలను మోపిరి. ఇంగ్లీషు విద్యనే చెప్పించవలెనని మెకాలే పెద్ద నివేదిక సమర్పించెను. బెంటిక్ గవర్నరు జనరల్ దాని నంగీకరించెను. ఈ సమీక్షాకాలములో విద్యకై ఇంగ్లీషువా రేమియు వ్యయము చేయలేదు. తుదకు 1855 లో మద్రాసు, కలకత్తా, బొంబాయి విద్యాపీఠాలను నెలకొల్పిరి. జనులు ఫార్సీకి వీడ్కోలు సలాము కొట్టి ఇంగ్లీషుకు (వెల్కం) స్వాగతం చేసిరి. కంపెనీ కాలములో మన విద్యల నెట్లు నాశనము చేసిరో ఆ వివరాలను చాలా విపులముగా మేజర్ బాసూగారు (Education under the E.I Co. అను పుస్తకములో) వ్రాసిరి. అభిలాషులు దానిని చూడగలరు.

ఇంగ్లండులో స్టీం యంత్రాలు విరివియయ్యెను. రైల్వేలు, స్టీం నావ వాడుకలోకి వచ్చెను. టప్పాతంతీ ఏర్పాట్లు జరిగెను. కాని వాటిని వారు వెంటనే హిందూస్థానములో ప్రవేశపెట్టలేదు. చాలాకాలము తర్వాత ప్రారంభించిరి. ప్రారంభించినను తమ మిలిటరీకి, తమ వ్యాపారాని కవసర మగునంత వరకు చూచుకొనిరి. "అనంశౌ క్లీబతితౌ" అని కుల మత భ్రష్టులకు హిందువుల తండ్రి ఆస్తిలో భాగము లేదనిరి. అది క్రైస్తవ మతవ్యాప్తి కాటంకమని 1856 లో ఆ యాటంకమును తొలగించి భాగ మిప్పించు శాసనము చేసిరి. కొన్ని రోడ్లు, కొన్ని కెనాలులు నిర్మించిరి. 1853 లో తంతీ (టెలిగ్రాం) స్థాపించిరి. అంతకు కొద్ది ముందుగా టప్పా ఏర్పాటు చేసిరి. రైల్వే నిర్మాణము