పుట:Andrulasangikach025988mbp.pdf/404

ఈ పుట ఆమోదించబడ్డది

(ఆ ప్రతి యిప్పుడు రెడ్డిహాస్టలులో కలదు) అవి సుందరముగానే యున్నవి. కాని భీష్ముడు ఔరంగజేబువలె, ధర్మరాజు అక్బరువలె, భీముడు మాహాదజీ సింధియావలె, ద్రౌపది ముమ్తాజ్ బేగంవలె, గాంధారి అహల్యాబాయివలె ఉన్నారు. అనగా అంతా మొగలాయిలే! పెద్దాపురము సంస్థానములోని కొన్ని చిత్తరువుల నిటీవల భారతిలో ప్రకటించినారు. వాటిని చూచినను అదే బావన కలుగును. బొబ్బిలి ప్రసిద్ధికల సంస్థానము కదా. అందు చిత్తరువు లుండినచో ప్రకటించుట చాలా యవసరము. తాండ్ర పాపారాయని చిత్తరు వుండినచో దాని కెంతైన విలువ యుండును. ఉత్తర సర్కారు జమీందారీలలోని చిత్తరువులు, గ్రంథాలయ విశేషాలు, ప్రాచీనాయుధాలు, ఉడుపులు, మున్నగున వెట్టివో తెలిపిన బాగుండును. హైద్రాబాదులోని రాజా శివరాజ బహద్దరు సంస్థానములో సాలార్జంగు ఎస్టేటులో, పలువురాంధ్రులు చాలా సుందరమగు చిత్తరువులను చిత్రించినట్లు ప్రతీతి. 300 ఏండ్లనుండి చిత్రించిన చిత్రాలు వేల కొలదిగా విదేశాలకు పోయెను. దేవిడీలనుండి దొంగిలించి చిత్రాలు హైద్రాబాదు జుమేరాత్ (దొంగ) బజారులో ప్రతివారం అల్పక్రయాలకే అమ్మేవారు. నేటికిని ద్రవ్యమున్నవారు హైద్రాబాదులో 200 ఏండ్లనాటి 100 ఏండ్లనాటి చిత్తరువులను విచిత్రశిల్ప వస్తువులను సేకరింపగలరు. వీటి సమృద్ధిని బట్టి హైద్రాబాదులో కళ లత్యంతముగా పోషితమై యుండెననుట న్యాయము. తంజావూరిలోని చిత్తరువులు కొన్ని ముద్రితమైనవి. అవి మనకు చాలా ఉపకరించినవి. వాటివల్లనే మనము త్యాగరాజును, వేమనను, తంజావూరి కొందరి రాజులను చూడగలిగినాము.

కలంకారీ అద్దకపు సూచన పూర్వ ప్రకరణాలలో చేయనైనది. ఈ యద్దకము తెలుగుదేశ మంతటనూ నుండెను. కాని ఉత్తర సర్కారులలో కృష్ణాజిల్లాలోను అందునూ బందరులోను వాటికి ప్రసిద్ది కలిగెను. కలంకారీ అద్దకానికి దేశీరంగులనే గట్టిరంగులనే వాడిరి. 'పెట్టె' రంగులు జర్మనీనుండి కారుచౌకగా దిగుమతియైన యీ 50 ఏండ్లలో మన దేశీ రంగులు తక్కిన పరిశ్రమలతోపాటు మాయమయ్యెను. 1920 ప్రాంతములో సర్ ప్రపుల్ల చంద్రరాయిగారు దేశీరంగ్ అను పుస్తకమును వ్రాసిరి. అదిప్పు డెందరివద్ద కలదు? మన అద్దకమువారు దాని నెరుగరు. అద్దకమువారిని ఉర్దూలో రంగ్రేజీ (రంగు వేయువాడు అని యర్థము. ఇది ఫార్సీ పదము) అనిరి. అదొక కులమై, అదే పేరుతో నిలిచినది. కర్నూలులో వారి దొక వీధియే కలదు. వారినే జీన్‌గర్ అనిరి.