పుట:Andrulasangikach025988mbp.pdf/401

ఈ పుట ఆమోదించబడ్డది

యిచ్చెడివారు. వారిలో సంకేతము లుండెను. వారు నానా వేషాలతో బాటసారులలో కలిసి వెళ్ళి వారిని చంపి దోచేవారు. వారి ఆయుధము రెండు మూరల దస్తీబట్టయే. దాని నొక మూల ముడివేసు మనిషి గొంతులో వేసి లాగి ఊపిరాడకుండా గుటుక్కు మనునట్లు చంపేవారు. ఆ క్రియ యంతయు రెండు క్షణాలలోనే ముగిసేది. వారిలో నిజాముద్దీన్ ఔలియా అనే ప్రసిద్ద భక్త ఫకీరు కూడా 1400 ప్రాంతములో చేరి యుండెను. వారికి ధనికులు జమీందారులు ఆశ్రయమిచ్చి వారు తెచ్చినదానిలో భాగము పొందిరి. అట్టి ఠగ్గులు ఉత్తర హిందూస్థానములో అధికముగా నుండినను వారి బాద రాయల సీమలో కొంతవరకు, హైద్రాబాదు రాజ్యములో చాలావర కుండెను. హైద్రాబాదు నగరములోని కారవాన్ నరే, చెన్నరాయని గుట్ట, షాలీబండా ప్రాంతాలలో వారు నివసించి ప్రయాణీకుల వెంటనంటి చంపేవారు. నిజామాబాదు, అదిలాబాదు ప్రాంతలలో వారు మరీ హెచ్చుగా నుండిరి. వారి చరిత్ర వివరాలను మెడోస్ టెయిలర్ (Canfessions of a Thug) వ్రాసెను. అమీరలీ అను వాడు 719 మందిని చంపి యుండెననియు వాడు ఠగ్గులలో అగ్రనాయకుడనీ అతడు వ్రాసెను. తుదకు 'ఠగ్గీ' స్లీమన్ అను బిరుదము పొందిన స్లీమన్ అను ఇంగ్లీషు అధికారి 1831 నుండి 1832 వరకు ప్రత్యేక ఠగ్గు విచారణ కర్తయై 3266 ఠగ్గులను పట్టి వారిలో చాలామందిని ఉరికంబ మెక్కించి దేశాన్ని వారి నుండి రక్షించెను.

బందిపోటు దొంగతనా లెక్కువగా పెరిగిపోయెను. తెలంగాణములో అరబ్బులు, రోహిలాలు నిరంతర మీ పనిలోనే యుండిరి. (ఆ వివరాలకై బిల్గ్రామీ గ్రంథము చూడదగినది.)

పంచాయతీల విధ్వంసము

రాజ్యాలు నాశనం కానీ, సామ్రాజ్యాలు మారనీ, రాజవంశాలు ద్వంసము కానీ, కొత్తవంశాలు రాజ్యానికి రానీ లేశమాత్రమైన వాటిముచ్చట గ్రామాలకు కాబట్టకుండెను. తమ పంచాయతీ రాజ్యము చల్లగానుంటే అదే మనపూర్వులకు పదివేలు. అదే వారికి శ్రీరామ రక్ష. అదే వారి రామరాజ్యం. పంచాయతీ తీర్పులలో కొన్ని మార్పుల న్యాయాలుండెను. అట్లు లేకుండిన పంచాయతీ రాజ్యమునకు వైకుంఠానికి భేదముండదు గదా! లోపములేని మానవసృష్టి యుండునా?