పుట:Andrulasangikach025988mbp.pdf/363

ఈ పుట ఆమోదించబడ్డది

కాని అతని కుమారుని రాజ్యకాలము తంజావూరులో స్వాతంత్ర్యము కూడా మట్టిలో కలిసెను.

మన సమీక్షా కాలములో ముసల్మానుల నీడలు తెలుగు వారిపై బాగుగా పారెను. ఆనాటి కవుల కవితలలో ఫార్సీపదా లెక్కువగా మిళిత మయ్యెను. క్రీ.శ. 1700 తర్వాత తెనుగువారి పతనము పూర్తి అయ్యెను. అటు తర్వాత చిల్లర పాలెగార్లే మనకు మిగిలిరి. వారి దర్జా యెంతటిదో అంత మేరకే మన కళలన్నియు నిలిచిపోయెను.

ఈ విధముగా ఆంధ్రదేశ సాంఘిక స్థితి క్రీ.శ. 1600 నుండి 1757 వరకుండెనని స్థూలముగా చెప్పవచ్చును.

__________

ఈ ప్రకరణమునకు ముఖ్యాధారములు

1. వేమన పద్యములు : వేమన పద్యాలు పెరుగుతూ వచ్చినవి. తమకు సరిపడనివారిని దూషించి వినురవేమ అన్నవారు పలువురు, రసవాదాలు కల్పించి విశ్వదాభిరామ అన్న వారు పలువురును బూతులు వ్రాసి నోటితీటను వదిలించుకొన్నవారు తమ పేరు తెలుపుకొను ధైర్యములేక వెర్రి వేమన్నకు వాటి నంటగట్టినవారు కొందరును ఉండినట్లూహించవలెను. వేమన ఆటవెలదిలోనే, సరిగా యతిస్థానములో విరుపుచేసి చక్కని కవితను చెప్పినాడని నమ్ముదును. అట్టివానిని మొదలేరి వేరుగా ప్రకటించుట యవసరము.

2. వెంకటాధ్వరి - విశ్వగుణాదర్శము. మూలము సంస్కృతము, తెనుగు పద్యాలను వ్రాసినవారు మంచి కవిత వ్రాయలేదు.

3. గోగులపాటి కూర్మ నాథుడు - సింహాద్రి నారసింహ శతకము.

4. భల్లా (ఛల్లా?) పేరకవి - భద్రాద్రి శతకము. ఈ తుది రెండు శతకాలు పూర్తిగా తురకలు తెనుగు దేశమందు చేసిన ఘోరాలను వర్ణించును. ఆ వివరములను తెలుసుకొనగోరువా రా రెంటిని పూర్తిగా చదువవలెను.